Jayasudha BJP: బీజేపీలో చేరిన నటి జయసుధ, ఏడాదిగా చర్చలు - నేడు ఢిల్లీలో కాషాయ కండువా
ప్రధాన మంత్రి మోదీ చేసిన అభివృద్ధిని చూసి బీజేపీలో చేరుతున్నానని జయసుధ అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో ఏడాదిగా సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.
సినిమాల్లో సహజ నటిగా పేరు పొందిన ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీకి కండువా కప్పుకున్నారు. బుధవారం (ఆగస్టు 2) ఢిల్లీ వెళ్లిన ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు కూడా జయసుధ వెంట ఉన్నారు.
అనంతరం జయసుధ మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీ చేసిన అభివృద్ధిని చూసి బీజేపీలో చేరుతున్నానని జయసుధ అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో ఏడాదిగా సంప్రదింపులు జరుపుతున్నానని, మొత్తానికి నేడు బీజేపీలో చేరినట్లుగా వెల్లడించారు. తన వర్గం అయిన క్రైస్తవుల ప్రతినిధిగా తాను గళం వినిపిస్తానని జయసుధ వెల్లడించారు.
ఆ స్థానం నుంచే పోటీ!
జయసుధ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇటీవల ఆమెతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించారు. అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయి చర్చించారు. ఈ క్రమంలో ఇవాళ బీజేపీలో చేరారు.
సికింద్రాబాద్ చుట్టుపక్కల అత్యధికంగా క్రైస్తవులు ఉంటారు. ఆ మతం అభిమానాన్ని పొందారన్న అభిప్రాయం ఉంది. అందుకే సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఆమెకు మంచి ఆదరణ ఉందని భావిస్తున్నారు. గతంలో ముషీరాబాద్ నుంచి బీజేపీ తరపున సీనియర్ నేత కె. లక్ష్మణ్ పోటీ చేసేవారు.ఆయన ఇప్పుడు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ బీసీ మోర్చాకు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదు. ఆయన లేకపోతే.. ఆయనకు బదులుగా బలమైన అభ్యర్థి జయసుధ అయితేనే బాగుటుందని.. బీజేపీ వర్గాలు అంచనాకు వచ్చి ఆమెతో సంప్రదింపులు జరిపినట్లగా తెలుస్తోంది.
వైఎస్ఆర్ సీపీలో దక్కని పదవులు
జయసుధ నాలుగేళ్ల క్రితం వైఎస్ఆర్ సీపీలో చేరినప్పటికీ అటు ప్రభుత్వం ఆమె సేవలను ఉపయోగించుకోలేదు. కనీసం పార్టీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని.. ఆ పార్టీలో లేనట్లేనని గతంలో ఓ సందర్భంలో అన్నారు. సినీ పరిశ్రమ నుంచి వైఎస్ఆర్ సీపీలో చేరిన చాలా మందికి పదవులు వచ్చాయి. ధర్టీ ఇయర్ ఫృథ్వీకి పదవి ఇచ్చినా కానీ మధ్యలో బయటకు పంపేయడంతో ఆయన సైడ్ అయ్యారు. తర్వాత పోసాని కృష్ణమురళి, అలీ, జోగి నాయుడుకు కూడా పదవులు వచ్చాయి. సీనియర్ నటుడు మోహన్ బాబు, జయసుధలను మాత్రం సీఎం జగన్ పట్టించుకోలేదు. దీంతో ఇద్దరూ వైసీపీకి దూరం అయ్యారు.
గతంలో జయసుధ తెలంగాణలో ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. 2009లో ఆమె కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం జయసుధ చాలా రాజకీయ పార్టీలు మారారు. తొలుత 2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరి తొలుత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాక.. తరవాత కొన్నాళ్ళకి టీడీపీలో చేరారు. మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2019లో వైఎస్ఆర్ సీపీలో సీఎం జగన్ సమక్షంలో చేరారు. తాజాగా బీజేపీలో చేరారు.
#WATCH | Delhi: Telugu actor and former MLA, Jayasudha joins BJP in the presence of Telangana BJP President G Kishan Reddy & BJP national general secretary Tarun Chugh. pic.twitter.com/MSLM8tSVWp
— ANI (@ANI) August 2, 2023