Kaleshwaram EE illegal assets: కాళేశ్వరం ఈఈకి 200కోట్లకుపైగా అక్రమాస్తులు- కొనసాగుతున్న సోదాలు- లింక్ ఎవరికి ?
Nune Sridhar: కాళేశ్వరం ఈఈ అక్రమాస్తులు రెండు వందల కోట్లకుపైగా ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Kaleshwaram EE Nune Sridhar illegal assets: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ శ్రీధర్ ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. భారీగా బంగారం, నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో పాటు మరో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు అనేక చోట్ల ఆస్తులను గుర్తించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్ పై అవినీతి నిరోధక శాఖ (ACB) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. జూన్ 11, 2025న హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో శ్రీధర్‌కు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాల విచారణలో శ్రీధర్ పై ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌తో సహా తెలంగాణలోని 12 ప్రాంతాల్లో శ్రీధర్, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. శ్రీధర్‌ను కరీంనగర్‌లోని SRSP క్యాంప్ ఆఫీసు నుండి అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని అతని నివాసానికి తీసుకువచ్చి సోదాలు చేశారు.
శ్రీధర్ అక్రమాస్తుల వివరాలు
తెల్లాపూర్‌లో ఉర్జిత్ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ విల్లా
షేక్‌పేటలో SKY HIGH గేటెడ్ కమ్యూనిటీలో 4,500 చదరపు అడుగుల ఫ్లాట్
మలక్‌పేటలో నాలుగు అంతస్తుల భవనం
వరంగల్‌లో మూడు అంతస్తుల భవనం
కరీంనగర్‌లో పలు హోటళ్లలో భాగస్వామ్యం
శ్రీధర్ తన కుమారుడి పెళ్లికి కోట్లు ఖర్చు పెట్టారు. థాయ్‌లాండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారు.
ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను ACB స్వాధీనం చేసుకుంది. శ్రీధర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అతను కరీంనగర్‌లోని చొప్పదండిలో SRSP క్యాంప్‌లో ఇరిగేషన్ శాఖ CAD డివిజన్ 8లో విధుల్లో ఉన్నారు. 2019లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లీకేజీల ఫిర్యాదులు రాగా, శ్రీధర్ ప్రాజెక్ట్‌ను తనిఖీ చేసి, "లీకేజీలు లేవు" అని నివేదిక సమర్పించాడు, ఫిర్యాదులను తేలికగా తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
— Telangana365 (@Telangana365) June 11, 2025
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ శ్రీధర్ ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా
ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ ఆస్తులపై ఏసీబీ ప్రకటన.
భారీగా బంగారం, నగలు, నగదు స్వాధీనం.. హైదరాబాద్‌లో పాటు మరో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు. pic.twitter.com/tQY8nIMHGi
శ్రీధర్‌పై నమోదైన అక్రమాస్తుల కేసు అతని ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతికి సంబంధించిన లింకులను ఆరా తీస్తున్నారు. ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ఈ కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) బుధవారమే హాజరయ్యారు. నూనె శ్రీధర్ అరెస్టుతో కాళేశ్వరం అవినీతిలో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.





















