మంచిర్యాలకు నేనే రాజు, నేనే మంత్రి! కాంగ్రెస్‌కు మంత్రి పదవిపై బీజేపీ, బీఆర్ఎస్ సంబరాలా?: ప్రేమ్ సాగర్ రావు
Telangana News | జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే మంచిర్యాల బీఆర్ఎస్, బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

మంచిర్యాల: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సంబరాల్లో మునిగిపోవడం విచిత్రంగా ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల మెయిన్ రోడ్ చౌరస్తాలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాలలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి అయితే ఆ రెండు పార్టీలు తెగ సంతోషించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి నేనే మంత్రి.. నేనే రాజు.. అని స్పష్టం చేశారు. ఎవరి జోక్యం ఇక్కడ అవసరం లేదని సూచించారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు అండగా ఉంటూ మంచిర్యాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
డిసెంబర్ నాటికి విస్తరణ పనులు
మంచిర్యాల పట్టణంలోని ప్రధాన వీధుల సుందరీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వర్షాల ఆకటంకం లేకపోతే డిసెంబర్ నాటికి రోడ్ల విస్తరణ, భూగర్భ మురికి కాలువల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు. రోడ్లు విస్తారంగా ఉంటేనే భావితరాలకు అభివృద్ధిని అందించిన వారం అవుతామన్నారు. కొంత మందికి రోడ్ల విస్తరణలో నష్టం జరిగినా తర్వాత కాలంలో వ్యాపారాలు ఊపందుకుంటాయని తెలిపారు.

విశ్వనాథ ఆలయం దుకాణాల సముదాయం కూల్చి వేతకు అనుమతి లభించిందని గురువారం ఉదయం కూల్చివేతలు ఉంటాయని తెలిపారు. అలాగే మంచిర్యాల పట్టణంలో వేంపల్లిలో ఐటీ పార్కుకు ఆమోద ముద్రపడిందని చెప్పారు. ఆటోనగర్, పరిశ్రమలు ఏర్పాటుతో అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.





















