Formula E race case: ఐఏఎస్ అర్వింద్ కుమార్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు - అరెస్టుల దిశగా చర్యలు ?
Formula E Race: ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.ఇది నాలుగో సారి కావడంతో అరెస్టులపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

ACB issues notice to IAS Arvind Kumar: తెలంగాణ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు అవినీతి నిరోధక శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్ములా ఈ రేసు కేసులో.. విదేశీ సంస్థకు అరవింద్ కుమారే నిధులు బదిలీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బులు బదిలీ చేయడంతో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ నోటి మాట ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు తాను డబ్బులు బదిలీ చేశానని చెబుతున్నారు.
2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసు, 2024లో రెండో ఎడిషన్‌కు సంబంధించి ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. ఈ రేసు నిర్వహణలో రూ.55 కోట్ల నిధులు లండన్‌కు చెందిన ఒక కంపెనీకి మళ్లించారని.. దీనికి సంబంధిత అధికారుల ఆమోదం లేకుండా జరిగిందని కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమాల వల్ల హెచ్ఎండీఏకు అదనంగా మరో రూ.8.06 కోట్ల అదనపు పన్ను భారం పడిందని ప్రభుత్వం గుర్తించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం. దానా కిషోర్ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ డిసెంబర్ 18, 2024న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో కేటీఆర్‌ను ప్రధాన ఆరోపితుడిగా (A1), అరవింద్ కుమార్‌ను A2గా, బీఎల్ఎన్ రెడ్డిని A3గా పేర్కొన్నారు.
అరవింద్ కుమార్ 2023లో MAUD స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్నారు. ఆయన కేటీఆర్ ఆదేశాల మేరకు నిధులను బదిలీ చేశానని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. జూన్ 25, 2025న అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది, జూలై 1, 2025న విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే, అరవింద్ కుమార్ జూన్ 30 వరకు సెలవులో ఉన్నారు. కుమార్తె గ్రాడ్యూయేషన్ కోసం యూరప్ వెళ్లారు. ఆయన తిరిగి రావడంతో నోటీసులు జారీ చేశారు. ఇంతకు ముందు జనవరి 8, 2025న అరవింద్ కుమార్ హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ సుమారు 5 గంటల పాటు జరిగింది, నిధుల బదిలీకి సంబంధించి విస్తృతంగా ప్రశ్నించారు. గ్రీన్‌కో స్పాన్సర్‌షిప్ నుండి ఎందుకు వైదొలిగారనే అంశంపై కూడా ప్రశ్నలు అడిగారు.
జనవరి 7, 2025న అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. - ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈ కేసులో జోక్యం చేసుకుంది. విచారణ జరుపుతోంది. అరవింద్ కుమార్ తన వాదనలో, తాను కేటీఆర్ ఆదేశాల మేరకు నిధులను బదిలీ చేశానని, అందులో తన వ్యక్తిగత ప్రమేయం లేదని పేర్కొంటున్నారు. - అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా తదుపరి విచారణలు జరగనున్నాయి. అరవింద్ కుమార్ విచారణ తర్వాత కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.





















