Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ అనుమతుల రద్దు వెనుక అసలు రహస్యమేంటి? చిచ్చురేపిన ఒక్క ప్రకటన
బనకచర్ల ప్రాజెక్టుకు నిపుణుల కమిటీ అనుమతి నిరాకరించడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ అనుమతుల రద్దు వెనుక తామే ఉన్నామని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా వాదులాడుకుంటున్నాయి.

బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అనుమతి నిరాకరించడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ అనుమతుల రద్దు వెనుక తామే ఉన్నామని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా వాదులాడుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ, ఈ 'ఘనత' తమదేనని చెప్పుకుంటున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య నడుస్తున్న రాజకీయ మూడుముక్కలాట ఏంటో చూద్దాం.
బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఎందుకు రద్దు చేశారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీని కోరింది. అయితే, ఈ అభ్యర్థనపై నిపుణుల కమిటీ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ తీర్పును ఇది ఉల్లంఘించడం అవుతుందని, అంతర్-రాష్ట్ర సమస్యలు ఈ బనకచర్ల ప్రాజెక్టులో మిళితమై ఉన్నాయని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అంతేకాకుండా, కేంద్ర జల సంఘం నుండి సరైన అనుమతులు లేవని, వరద జలాలపై సమగ్ర అంచనాలు లేవని కారణాలను ఎత్తి చూపుతూ, ఈ దశలో బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ వార్త తెలియగానే, తెలంగాణలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ఈ విజయం తమదేనని చెప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి.
'మా పోరాట ఫలితం' అంటోన్న అధికార కాంగ్రెస్
గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ఈ బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర నిపుణుల కమిటీ అనుమతులు నిరాకరించడం తమ ప్రభుత్వ ఘనతేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం, తాను స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసినందుకే ఈ సానుకూల ఫలితం వచ్చిందని వారు పేర్కొన్నారు. "గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలు మొదలుపెట్టిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. నాటి తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుని ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు" అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. "కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. గోదావరి జలాలను సీమకు తరలిస్తుంటే కేసీఆర్ ఆనాడు సీఎంగా నోరెత్తలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఏపీ జలదోపిడీని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ విజయమే" అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇలా అధికార కాంగ్రెస్ తమ విజయాన్ని చాటుకుంటూనే, ఈ సమస్యకు మూల కారణం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆరేనని విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.
'మా పోరాటాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోంది' అంటోన్న బీఆర్ఎస్
బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల రద్దు తమ పార్టీ పోరాటం వల్లేనని, ఇది తమ విజయమని, దీన్ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేస్తోందని గులాబీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు మాట్లాడుతూ "బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెంపపెట్టు. ఇది బీఆర్ఎస్ పార్టీ పోరాట విజయంగా, తెలంగాణ ప్రజల విజయంగా మేము భావిస్తున్నాం. జనవరిలోనే మేము బనకచర్ల వివాదాన్ని బయటపెట్టాం, ఆ తర్వాతే కాంగ్రెస్ స్పందించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి పాత తేదీలతో లేఖ రాశారు" అని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఆ పార్టీలో ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తోన్న మరో కీలక నేత కవిత స్పందిస్తూ "తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జలదోపిడీకి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలి. బనకచర్ల ప్రాజెక్టుపై వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలి" అని పేర్కొన్నారు.
'కాంగ్రెస్, బీఆర్ఎస్ లవి డ్రామాలే, అడ్డుకుంది కేంద్రమే' అంటోన్న బీజేపీ
బనకచర్ల ప్రాజెక్టు అనుమతులు అడ్డుకున్నది మేం అంటే మేము అంటోన్న కాంగ్రెస్ - ఇటు బీఆర్ఎస్ పార్టీలకు పోటీగా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు పార్టీలు బనకచర్ల ప్రాజెక్టు పేరుతో డ్రామాలాడుతున్నాయని కమలం నేతలు విమర్శిస్తున్నారు. ఇందులో ఏ పార్టీ ఏం చేసిందేమీ లేదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు రాలేదు తప్ప ఏ పార్టీ అడ్డుకోలేదని వివరిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, "బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడినవన్నీ డ్రామాలే. భారతీయ జనతా పార్టీ పక్షాన మొదటి నుండి మేము ఇదే చెబుతున్నాం. అయినా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి విష ప్రచారం చేశాయి" అని విమర్శించారు. ఇదే విషయంలో మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, "ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా నిబంధనల ప్రకారమే కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలే అమలు అయ్యాయి" అని పేర్కొన్నారు.
ఇలా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా ప్రజలను ఆకట్టుకునే దిశగా బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల రద్దును వాడుకుంటున్నాయి. ఈ ఘనత తమదంటే తమదంటూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు పరస్పరం సంధించుకుంటున్నారు. ఇదే విషయమై అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ ను చేస్తున్నారు.






















