Banakacherla Project: తెలంగాణ ప్రచారంపై ఏపీ కౌంటర్ యాక్షన్- బనకచర్లపై కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రత్యేక బృందం
Banakacherla Project: బనకచర్ల వివాదంపై ప్రత్యేక బృందాన్ని ఢిల్లీ పంపించాలని ఏపీ నిర్ణయించింది. తెలంగాణలో పార్టీలు చేస్తున్న ప్రచారానికి కౌంటర్‌గావాస్తవాలు కేంద్రం ముందు ఉంచాలని భావిస్తోంది.

Banakacherla Project: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతున్న బనకచర్లపై నిజానిజాలు కేంద్రం ముందు ఉంచి అనుమతులు పొందాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ చేస్తున్న ప్రచారాన్నికి విరుగుడు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన సీఎం, మంత్రులు కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో సమావేశమై బనకచర్లపై ఫిర్యాదుల చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రంతో కలవాలని చూస్తోంది. ప్రత్యేక బృందంతో ఢిల్లీ వెళ్లాలని భావిస్తోంది.
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక బృందాన్ని ఢిల్లీ పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది ఉండదని వారిని ఒప్పించనుంది. ఇందతా రాజకీయం కోసం బీఆర్‌ఎస్ రాద్దాంతం చేస్తోందని తెలియజేయనుంది. పూర్తి వివరాలు కేంద్రం ముందు ఉంచిన తర్వాత వారి సమక్షంలోనే ఏపీ తెలంగాణ మధ్య చర్చలు జరిగేలా చూడనుంది. వారి సంప్రదింపులతోనే ప్రక్రియను వేగవంతం చేయబోతోంది.
మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ముగ్గురు నలుగుర మంత్రులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించినందున మరోసారి ఓ ప్రత్యేక బృందంతో వెళ్లి నిజానిజాలు వెళ్లడించాలని నిర్ణయించారు. తెలంగాణ పార్టీలు ఏకమై రాజకీయ పోరాటం చేస్తున్నందు అదే రీతిలో విరుగుడు చర్యలు తీసుకోవాలని భావించారు. ప్రత్యేక బృందం వెళ్లడం ఉత్తమైన మార్గంగా తేల్చారు. సమగ్ర సమాచారంతో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మంత్రిని కలవాలని నిశ్చయించారు.
ఎవరి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లాలనే విషయంపై క్లారిటీ లేదు. పూర్తి సమాచారంతో ప్రత్యేక వినతి పత్రం, అందుకు తగ్గ డాక్యుమెంట్స్ రెడీ చేయాలని అధికారులు ఆదేశించారు. అనంతరం ఢిల్లీలో అపాయింట్మెంట్ లభించినదాని బట్టి బృందం వెళ్లనుంది. తెలంగాణలో కేవలం రాజకీయంగా లబ్ధిపొందాలని దీన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. సముద్రంలోకి వెళ్లే వృథా నీటిలో 200 టీఎంసీలను సీమకు తరలించేందుకు బనకచర్ల రూపొందిస్తున్నామని అన్నారు. దీని వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమో అర్థం కావడం లేదని ఆశ్చర్యపోయారు.
ఇప్పటికే ఈ బనకచర్ల ప్రాజెక్టుపై ప్రి ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి సమర్పించింది ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ- పర్యావరణశాఖ అనుమతులు వస్తే పూర్తి స్థాయి ప్రాజెక్టు రిపోర్టు కేంద్రానికి సమర్పించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కానీ ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదనందున వారు చేసే విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదని కేబినెట్‌లో సీఎం చంద్రబాబు చెప్పారు. మీడియాతో మాట్లాడే టైంలో సంయమనం పాటించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వంతోపాటు అన్ని పార్టీలు బనకచర్లకు వ్యతిరేకంగా స్వరం అందుకున్నాయి. అసలు ఈ ప్రాజెక్టుకు ఆధ్యం పోసింది కేసీఆర్ అంటు కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టును ఆడ్డుకోవాలని కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం కలిసింది. బనచర్ల అడ్డుకోవడానికి రేవంత్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబుతో లాలూచీ పడ్డారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తూ వచ్చింది.





















