Kodanda Ram: 'ఏ పదవి అప్పగించినా బాధ్యతగా నెరవేరుస్తా' - ఏబీపీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ కోదండరాం
Telangana MLC Elections: తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ సీటును తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధమైన నేపథ్యంలో ఏబీపీ దేశం ప్రత్యేక ఇంటర్వ్యూ.
Kodandaram Interview: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. అందులో ఒకటి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. ఈ సందర్భంగా త్వరలో ఎమ్మెల్సీగా ఎన్నికవనున్న ప్రోఫెసర్ కోదండరాం ఏబీపీ దేశం ఇన్ పుట్ ఎడిటర్ వై.సుధాకర్ రావుకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూ పూర్తి పాఠం.
ప్రశ్న. ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో పోరాటాలు జరిపారు. ఇప్పుడు చట్టసభల్లోకి వెళ్లనున్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్... మీ కార్యాచరణ ఏంటి. ?
జవాబు.- పార్టీలో, మద్ధతుదారుల్లో చాలా సంతోషం ఉంది. ఇది కొత్త అనుభవం. ఎలా నిర్వర్తించాలన్న దానిపై సంసిద్ధత అవసరం.
ప్రశ్న - కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి క్యాబినెట్ లోకి చేరమని ఆహ్వానిస్తే... మీరు మంత్రిగా చేరుతారా..?
జవాబు - ఎన్నికల ముందే కాంగ్రెస్ కొంత హమీ ఇచ్చింది. ఏ రకంగా భాగస్వామ్యం దొరికినా నిరాకరించేది లేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే తప్పక కోరుకుంటున్నాం. తప్పకుండా బాధ్యతలు ఏవైనా స్వీకరించాలన్నదే మా అభిప్రాయం.
ప్రశ్న - విద్యారంగంలో ఆచార్యులుగా ఉన్నారు. విద్యా శాఖ లాంటి శాఖ నిర్వరించాలనుకుంటున్నారా.. ఏ శాఖ అయితే మీరు ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంది. ?
జవాబు - ఏ శాఖ అన్నది ఆలోచించ లేదు. భాగస్వామ్యం కోసమే ఆలోచించాం. ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ పదవులు అడిగాం. అందుకు కాంగ్రెస్ అంగీకరించింది. టికెట్ రానివారికి ఏదో విధంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని రాహుల్ గాంధీ సైతం హమీ ఇచ్చారు. పదవుల విషయంలో ఇంకా స్పష్టత లేదు కాబట్టి ఇప్పుడే స్పందించడం సరికాదు. కలిసి పని చేశాం కాబట్టి ఈ విషయంలో ముందస్తు కామెంట్లు చేయడం ఉపయోగకరం కాదని నా అభిప్రాయం.
ప్రశ్న - కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో చేరమని ఆహ్వానిస్తే అభ్యంతరం ఏం లేదు కదా..?
జవాబు - కాంగ్రెస్ ఆహ్వానిస్తే.. ఏరకమైనా భాగస్వామ్యమైనా నిరాకరించం. ఏదైనా బాధ్యత అప్పగిస్తే కమిట్మెంట్ గా పని చేయాలన్నదే పార్టీ నిర్ణయం. పదవులు తెలంగాణ ప్రజల లక్ష్యం చేరుకోవడానికి మార్గమే తప్ప, మరో అభిప్రాయం పార్టీలోను, నాలోను లేదు.
ప్రశ్న - మీరు అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ గాని, మంత్రి గాని అవుతారు. కాని మీ పార్టీ నేతల పరిస్థితి ఏంటి. ? వారికి మీరు లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హమీ ఏంటి. ?
జవాబు - కాంగ్రెస్ వారే చెప్పారు. కార్పోరేషన్ పదవులు ఇస్తామన్నారు. చాలా కాలం నుంచి మాతో కలిసి జన సమితి నేతలంతా తెలంగాణ ప్రజల పని చేశారు. కాబట్టి వారికి సేవలు అందించడానికి మార్గం పదవులు. వారికి కూడా అవకాశం దొరికితే తెలంగాణ కోసం సమర్థంగా పని చేస్తారు. వ్యక్తిగత ప్రయోజనాలు, ఆశలు మా పార్టీలో ఎవరికీ లేవు. కీర్తి కిరిటాలతో మనం పుట్టలేదు. సమాజం కోసం పని చేసే క్రమంలో పదవులు వస్తాయి. వాటిని సమాజం కోసం వాడాలన్నదే మా లక్ష్యం.
ప్రశ్న - సీఎంగా రేవంత్ రెడ్డి పరిపాలన నెల రోజులు పూర్తయింది. గత ప్రభుత్వానికి –ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఏముంది. ?
జవాబు - తేడా ఏంటంటే ఆంక్షలు తొలిగిపోయాయి. ఇది అందరు సంబురపడుతున్న తరుణం. ప్రగతి భవన్ కంచెలు తొలగించారు. అది ముట్టుకున్నందుకే మాలాంటి చాలా మందిపై కేసులు పెట్టారు. నాడు ఏదో తెలియని దిగ్భంధనం చాలా వేదనకు గురి చేసింది. సామన్య ప్రజలు ఇప్పుడు స్వేచ్చగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది సామాన్య విషయం కాదు. కట్టడి పోయింది కాబట్టి స్వేచ్చగా మాట్లాడుతున్నారు అందరూ.
ప్రశ్న - తెలంగాణలో జిల్లాలను మార్చుతాం మళ్లీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ అభిప్రాయం ఏంటి. ?
జవాబు - అవును జిల్లాల ఏర్పాటుపై సమీక్ష జరపాల్సి ఉంది. సమగ్రంగా చేయలేదు. కూర్పు అడ్డగోలుగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సమీక్ష చేయాల్సి ఉంది. హన్మకొండ – వరంగల్ ఒక పట్టణం. దాన్ని సమగ్రతను దెబ్బతీసేలా రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు. ఆ పట్టణ ప్రత్యేకతను, అస్థిత్వాన్ని దెబ్బకొట్టారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేకతను దెబ్బతీసారు. ఉద్యోగాల్లో ఇబ్బందులు వస్తున్నాయి.
ప్రశ్న – మల్టీ జోన్లను కూడా మార్చాల్సిన అవసరం ఉందా..?
జవాబు - ఉద్యోగాల విషయంలో ఇబ్బందులున్నాయి. దీన్ని సమీక్షించాలి. ప్రజాభిప్రాయం సేకరించాలి. నిపుణులతో కూడిన కమిటీ వేసి వారి అభిప్రాయాలతో మార్పులు చేర్పులు చేయడం తప్పుకాదు. చిన్న జిల్లాలు- పెద్ద జిల్లాలు వంటి తారతమ్యాలు సరి కాదు.
ప్రశ్న - గత ప్రభుత్వాల పథకాలను సమీక్షిస్తాం అంటున్నారు. దళిత బంధు తొలగిస్తారా....మీ అభిప్రాయం ఏంటి.?
జవాబు - స్కీంలను రద్దు చేయడం కాదు. సమీక్ష జరపాలి. పది లక్షలు ఇవ్వడం బాగానే ఉంది. కాని అమలు చేయని ఆలోచనలు తయారు చేసి ఏం లాభం. ఏ పథకమైనా అమలు చేసే విధంగా డిజైన్ చేయాలి. అది దృష్టిలో పెట్టుకుని పాత పథకాలపై సమీక్ష జరపాలి.
ప్రశ్న - పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ పోటీలో ఉంటుందా. ? లేక కాంగ్రెస్ కు మద్ధతు ఇస్తారా..?
జవాబు - జాతీయ స్థాయి రాజకీయాల్లో మా పాత్ర పెద్దగాలేదు. కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గెలవాలి. వారికే మద్ధతు ఇస్తాం. కేంద్రంలో కూడా పాలన మారాలి. దానికి సహకరిస్తాం.
ప్రశ్న - టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలకే అప్పడు గళం విప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా పని చేస్తే ఎప్పుడు గళం విప్పుతారు.?
జవాబు - అలాంటి టైం బాండ్ ఏం లేదు. ఐదేళ్లు సరిగా పని చేస్తే.. ఐదేళ్లు సహకరిస్తా. ఇప్పడే దీని మీద వ్యాఖ్యానించ లేను.
ప్రశ్న - కోదండరాం గారు పాత ఉద్యమకారుడుగానే ఉన్నారా ? లేదా...ఫక్తు రాజకీయనాయకుడిగా మారారా.. ? అనే స్పష్టత ఇవ్వండి. ?
జవాబు – నాకు 70 ఏళ్లు వస్తున్నాయి. ఇప్పుడు మారితే ఏం లాభం. ఫక్తు రాజకీయ నాయకుడిగా ఇప్పుడేం మారతాం. ప్రజలకు అవకాశం ఉన్నప్పుడు ఆ వ్యవస్థను కాపాడుకోవాలి. ఉన్న వ్యవస్థను కుప్పకూల్చడం సరి కాదు.
ప్రశ్న - నాడు టీఆర్ఎస్ కు సహకరించకుండా.. నేడు కాంగ్రెస్ కు సహకరించడం వెనుక ఆంతర్యం ఏంటి. గులాబీ నేతలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాదా ? మీరు మౌనంగా ఉంటే...?
జవాబు - టీఆర్ఎస్ గవర్నమెంట్ కు సహకరించాం. మీ పార్టీలో చేరం..కండువా కప్పుకోం...మేం పోటీ చేయం అని చెప్పాం.
ప్రశ్న - కేసీఆర్ మీకు ఎంపీగా ఆఫర్ ఇస్తే మీరే తీసుకోలేదు కదా..?
జవాబు - అవును ఎంపీగా ఆఫర్ ను తిరస్కరించాను. కాని ప్రణాళిక రచనలోను, ఏదైనా పథకం అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వమంటే ఇస్తామని, తెలంగాణ కోసం ఏ సూచనలు ఇవ్వమన్నా ఇస్తామని చెప్పాం.
ప్రశ్న - అంటే కేసీఆర్ మీకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వలేదంటారా..?
జవాబు – అవును. మాకు అవకాశం ఇచ్చి ఉంటే తప్పనిసరిగా పని చేసేవాళ్లం. జీతం కూడా వద్దన్నాం. ఆ విషయంలో మేం వెనుకకు పోలేదు. వారికి వారు మాపై దాడి చేయడం వల్లే మేం ప్రతిస్పందించాం తప్ప మేం వారిని ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదు.
ప్రశ్న - బీఆర్ఎస్ ఓటమికి కారణం ఏం అనుకుంటున్నారు. ?
జవాబు - నియంతృత్వ పోకడలు, సొంత లాభం కోస సమిష్టి వనరులను కొల్లగొట్టడం ఓటమికి కారణం. ఇలా మాట్లాడి ఉంటే గెలిచేవాళ్లం, అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచే వాళ్లమనుకోవడం ఏది సరి కాదు. ఏవీ బీఆర్ఎస్ ను కాపాడేవి కావు. ఎన్నికల్లో ఇంకా బాగా మేనేజ్ చేసి ఉంటే కాంగ్రెస్ మరో నాలుగైదు స్థానాలు గెలిచేది.
ప్రశ్న - బీఆర్ఎస్ కు మీరు ఇచ్చే సలహా ఏంటి. ?
జవాబు - ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. రాజ్యాంగ బద్ధంగా పాలనసాగాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరంగా ఉంటుంది.
ప్రశ్న - భవిష్యత్తులో తెలంగాణ జన సమితి ఉంటుందా...లేక కాంగ్రెస్ లో విలీనం అవుతుందా ?
జవాబు – తెలంగాణలో మా పాత్ర అవసరం ఉంది. మేం కాంగ్రెస్ లో విలీనం చేయం. మా పాత్ర మేరకు మేం తెలంగాణ కోసం పని చేస్తాం.
Also Read: TRS BRS : బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా పేరు మారిస్తే రాత మారిపోతుందా ? బీఆర్ఎస్ పెద్దల ఆలోచన ఎలా ఉంది ?