(Source: ECI/ABP News/ABP Majha)
Six Guarantees: ఆధార్‌తోనే ఆరు గ్యారంటీలకు లింక్ - అప్‌డేషన్ కోసం జనం బారులు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్నఆరు గ్యారెంటీల కోసం... జనం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఆధార్ అప్‌డేషన్ కోసం క్యూ కడుతున్నారు.
Congress Six Guarantess In Telangana: నేటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. మహాలక్ష్మి గ్యారంటీ కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలకు ఉచిత సిలిండర్లు, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్లు, తెలంగాణ గృహ జ్యోతి కింద 200 యూనిట్ల విద్యుత్, పెన్షన్లు వంటి పథకాల కోసం ఆశావహుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబంధించి నిన్న దరఖాస్తు ఫారం విడుదల చేశారు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆరు గ్యారంటీలకు ఒకే ఒక్క దరఖాస్తు సరిపోతుందని చెప్తారు. అయితే.. ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరి చేశారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా ప్రజాపాలన దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుందని తెలిపారు.
అన్నింటికీ ఆదే ఆధారం
ఆరు గ్యారంటీ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయడంతో... జనం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకునేందుకు, అప్‌డేషన్ కోసం హైరానా పడుతున్నారు. ఆరు గ్యారంటీ పథకాలకు ఆధార్ అనుసంధానంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ముందు జాగ్రత్తగా ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకుంటున్నారు. ఇందు కోసం ఆధార్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. కొత్తగా పెళ్లిళ్లు అయిన వారు, ఇంటి పేరు మార్చాల్సిన వారు, చిరునామా మార్చుకోవాల్సిన వారు... ఇలా... ఆధార్‌లో ఎలాంటి మార్పులు ఉన్నా... వెంటనే మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని ఆధార్ సెంటర్‌లు అన్నీ జనంతో నిండిపోతున్నాయి.
ఈకేవైసీ అవసరం లేదు
మొన్నటి వరకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలంటే... ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని ప్రచారం జరిగింది. దీని కోసం.. చాలా మంది గ్యాస్ ఏజెన్సీలు, మీసేవల దగ్గర క్యూకట్టి... ఈ-కేవైసీ పూర్తిచేసుకున్నారు. దీని కోసం కూడా క్యూలైన్లలో రోజులు, గంటల తరబడి క్యూకట్టారు. ఈ-కేవైసీ అయిపోయిన తర్వాత... ఇప్పుడు ఆధార్ అప్‌డేషన్ కోసం అవస్థులు పడుతున్నారు. ఆధార్ సెంటర్ల దగ్గర భారీగా క్యూలైన్లు ఉండటంతో... గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. క్యూలో ఉన్న అందరికీ ఒక రోజులో పనికాకపోతే... మరో రోజు కూడా క్యూలైన్‌లో నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది.
వలసదారుల పరిస్థితి ఏంటీ?
మహానగరం హైదరాబాద్‌లో జనాభా కంటే ఆధార్ నమోదు సంఖ్య దాటింది. ఇతర రాష్ట్రాలు నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారు నగరంలోనే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి వారితో ఆధార్ నమోదు సంఖ్య పెరిగిపోతోంది. మహానగరంలో ఏటా జనాభా వృద్ధి రేటు 8 నుంచి 12 శాతానికిపైగా పెరుగుతోంది. 2023 చివరి నాటికి హైదరాబాద్‌లో జనాభా కోటి 50లక్షల దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయితే... దానికి మించి ఆధార్ నంబర్లు సంఖ్య జారీ అయినట్లు యూఐడీఏఐ లెక్కలు చెప్తున్నాయి. మరి అంతమందికి... ఆరు గ్యారంటీలు అమలు చేస్తారా..? అన్నది చూడాలి.
నిన్న (బుధవారం) ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారంను విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం... ఆరు గ్యారంటీలకు అప్లై చేసుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలని స్పష్టం చేసింది. అంతేకాదు... ఫ్రీ సిలిండర్ కోసం గ్యాస్ బుక్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ కోసం మీటర్ కనెక్షన్ నంబర్, కరెంటు బిల్లు, కొత్తగా వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అని తెలిపింది. ఇక... రైతు భరోసాకు దరఖాస్తు చేయాలంటే పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌లు, సర్వే నంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే... వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డు తప్పనిసరి చేశారు. రేషన్ కార్డు లేని అప్లికేషన్‌లో లేదు అని నమోదు చేయాల్సి ఉంటుంది.