Voter Verification: తెలంగాణాలో 7.6 లక్షల ఇళ్లపై ఎన్నికల కమిషన్ నిఘా, ఎందుకంటే ?
Voter Verification: తెలంగాణలో ఒకే ఇంట్లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న 7.6 లక్షల ఇళ్లను భారత ఎన్నికల సంఘం గుర్తించింది.
Voter Verification: తెలంగాణలో ఒకే ఇంట్లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న 7.6 లక్షల ఇళ్లను భారత ఎన్నికల సంఘం గుర్తించింది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన డెబ్బై ఆరు లక్షల మంది ఓటర్లు ఈ ఇళ్లలో నివసిస్తున్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో కొన్ని డోర్ నంబర్లలో 100 మందికిపైగా ఓటర్లు ఉన్నారట. పాతబస్తీలోని కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 17,139 ఇళ్లు ఉన్నాయి, ఒక్కో ఇంట్లో సగటున 12.5 ఓటర్లు చొప్పున 2.1 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నాంపల్లిలో ఒక్కో ఇంట్లో సగటున 13.4 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు.
మురికివాడల్లో చాలా మంది ఒకే ఇంట్లో నివాసం ఉంటారని పోల్ నిపుణులు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని యాకుత్‌పురా, కార్వాన్ వంటి కొన్ని నియోజకవర్గాలలో జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండడడంతోపాటు ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎల్‌బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,759 ఇళ్లుండగా 1.48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రాజేంద్రనగర్‌లో 13,901 ఇళ్లలో 1.47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
దీనిపై తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ స్పందించారు. వీటిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. చాలా సార్లు, చాలా మంది, చాల ప్రదేశాల్లో ఓటర్లు మారారని అన్నారు. రాబోయే కొద్ది వారాల్లో ఎన్నికల అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తారని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధలన మేరకు బోగస్, డూప్లికేట్ ఓటర్లను తొలగించే పనిలో ఉన్నట్లు తెలిపారు.
ఓటర్లలో చాలా మంది తమ నియోజకవర్గ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారని, దానితో పాటు ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలోని నమోదులను సరిచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల దరఖాస్తులను వచ్చినట్లు చెప్పారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారంతో హైదరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఈఆర్‌డబ్ల్యుఎఎస్‌ల నుంచి చిరునామా మార్పులు, సవరణల కోరుతూ సుమారు 40,000 కొత్త దరఖాస్తులు వచ్చాయని ఆయన వెల్లడించారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల గుర్తింపు ప్రక్రియ తెలంగాణలో ముమ్మరంగా కొనసాగుతోంది. ఒకే ఇంట్లో ఆరు కంటే ఎక్కువ ఓట్లు ఉన్నట్లయితే వాటిని బీఎల్వోలు జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. జాబితా ప్రకారం ఓట్లను పరిశీలించి ఇంటి నంబరును అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు. ఒకే ఫొటోతో మరెక్కడైనా ఓటు ఉన్నట్లయితే ఒక చోట తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆయా రాజకీయ పార్టీల నాయకులతో ఏఆర్వోలు(ఆర్డీవో) సమావేశాలు ఏర్పాటు చేసి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిశీలిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణకు చర్యలకు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మరణించిన ఓటర్ల పేరును జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ విషయమై రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులొస్తే పరిశీలిస్తున్నారు. ఒకే గ్రామంలో లేదా పట్టణంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన(పోలింగ్ బూత్ మారిన) ఓటర్లు ఫాం-8 ద్వారా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఏఆర్వోలు సూచనలు జారీ చేశారు. దీని ద్వారా పోలింగ్ చిట్టీలు పంచే క్రమంలో ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు.