Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
ట్విట్టర్ యాడ్ రెవిన్యూ కంటెంట్ క్రియేటర్లతో షేర్ చేసుకోనున్నామని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు.
నేటి నుంచి క్రియేటర్లతో యాడ్ రెవిన్యూ పంచుకోవడం ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ హెడ్ ఎలాన్ మస్క్ తెలిపారు. కంటెంట్ క్రియేటర్ల రిప్లై థ్రెడ్స్‌లో కనిపించే ప్రకటనలకు ఈ ఆప్షన్ వర్తిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ కోసం ఇన్‌కం మోడల్‌ను మెరుగుపరచాలని యోచిస్తున్న ఎలాన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయం ఇది. Dogecoin (DOGE) ఆధారిత చెల్లింపులను Twitter లాంచ్ చేస్తుందని చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. అయితే దానికి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కచ్చితంగా తీసుకుని ఉండాలని తెలిపారు.
ట్విట్టర్ బ్లూ సర్వీస్ డిసెంబర్ 13వ తేదీన రీలాంచ్ కూడా అయింది. మొదట ట్విట్టర్ బ్లూ లాంచ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అనేక లోపాలు తెరపైకి వచ్చాయి. వీటిని మెరుగుపరచడం కోసం కంపెనీ ఈ సర్వీసును రీలాంచ్ చేసింది. ఈ సర్వీసు ప్రస్తుతానికి కొన్ని దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ట్విట్టర్ దీన్ని ప్రతిచోటా విస్తరించాలని యోచిస్తుంది. అతి త్వరలో భారత్‌లోనూ దీన్ని ప్రవేశపెట్టనున్నారు. లాంచ్‌కు ముందు భారతదేశంలో దీని ధరకు సంబంధించిన లీక్‌లు కూడా తెరపైకి వచ్చాయి.
కంపెనీ తన బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను నవంబర్‌లో ప్రారంభించింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో బ్లూ టిక్ కోసం ప్రతి నెలా యూజర్ల నుంచి నగదు వసూలు చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో లొకేషన్, వెబ్, ఐఓఎస్ ఆధారంగా వేర్వేరు ఫీజులను నిర్ణయించారు. నవంబర్‌లో ఈ సేవ ప్రారంభించినప్పుడు, నకిలీ ట్విట్టర్ ఖాతాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో కంపెనీ ఈ సర్వీసును వెంటనే నిలిపివేసింది. తర్వాత డిసెంబర్ 13వ తేదీన మళ్లీ రీలాంచ్ చేసింది. అయితే ఈ సేవ భారతదేశంలో ఇంకా ప్రారంభం కాలేదు. అయితే దీని ఐవోఎస్ సబ్‌స్క్రిప్షన్ ధర లాంచ్‌కు ముందే లీక్ అయింది.
ప్రస్తుతం బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో ప్రారంభం అయింది. త్వరలో భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలోని iOS వినియోగదారుల కోసం ఈ సబ్‌స్క్రిప్షన్ ధరను ఒక టిప్‌స్టర్ లీక్ చేశారు. ఐవోఎస్ యాప్ స్టోర్‌లో కొత్త ట్విట్టర్ బ్లూ ధర రూ.999 అని ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఈ సేవను దేశంలో ప్రారంభించలేదు. దీంతో పాటు భారతదేశంలో దాని ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
దీంతో పాటు ఇటీవల వినిపిస్తున్న వార్తల ప్రకారం Twitter తన వినియోగదారులను ఏదైనా ట్వీట్ లేదా పోస్ట్ స్క్రీన్‌షాట్ తీయడానికి అనుమతించదు. షేర్ చేయడం ఒక్కటే ఆప్షన్ కానుంది. ట్విట్టర్ వినియోగదారులు పోస్ట్ లేదా ట్వీట్ స్క్రీన్ షాట్ తీస్తున్నప్పుడల్లా, స్క్రీన్‌షాట్‌కు బదులుగా ట్వీట్‌ను షేర్ చేయమని వారికి నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది వినియోగదారులు దీనిని నివేదించారు కూడా. ట్విట్టర్ ఈ చర్యను మొదట యాప్ పరిశోధకురాలు జేన్ మంచున్ వాంగ్ గమనించారు. స్క్రీన్‌షాట్ తీస్తున్నప్పుడు కొంతమంది వినియోగదారులకు ట్విట్టర్ పాప్-అప్ నోటిఫికేషన్‌ను పంపడాన్ని అతను గమనించాడు. స్క్రీన్‌షాట్‌లు తీయడానికి బదులు, ట్వీట్‌ను షేర్ చేసి, లింక్‌ను కాపీ చేయమని ట్విట్టర్ అడుగుతున్నట్లు వాంగ్ చెప్పారు.
To be eligible, the account must be a subscriber to Twitter Blue Verified
— Elon Musk (@elonmusk) February 3, 2023