Twitter Gold: గోల్డ్ టిక్‌కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!
ట్విట్టర్ గోల్డ్ టిక్‌కు నెలకు 1000 డాలర్లను ఎలాన్ మస్క్ త్వరలో వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Twitter Gold Tick: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, ఈ ప్లాట్‌ఫారమ్‌లో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉన్నాయి. త్వరలో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో గోల్డ్ టిక్‌ను మెయింటెయిన్ చేయడానికి కంపెనీల నుంచి నెలకు 1,000 డాలర్లు వసూలు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారాన్ని కంపెనీ సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ట్విట్టర్‌లో కంపెనీలకు గోల్డ్ టిక్ ఇస్తారని సంగతి ఇప్పటికే తెలిసిందే. ఉదాహరణకు మీకు ఏదైనా మీడియా ఛానెల్ లేదా ప్రైవేట్ కంపెనీ ఉంటే ట్విట్టర్ దానికి గోల్డ్ టిక్ అందిస్తారు.
సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా షేర్ చేసిన ట్వీట్‌లో, ట్విట్టర్ 'వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్' అనే కొత్త ప్రతిపాదనను ప్రారంభిస్తున్నట్లు చూడవచ్చు. దీని కోసం కంపెనీలు నెలకు 1,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ తన ఉద్యోగుల ఖాతాను తన ఖాతాతో లింక్ చేయాలనుకుంటే దీని కోసం అదనంగా 50 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్‌ను యాక్సెస్ చేయడం ద్వారా కంపెనీలు, వాటి అనుబంధ ఖాతాల ట్వీట్‌ల రీచ్ పెరుగుతుంది. వాటికి మరింత బూస్ట్ లభించనుంది. కంపెనీలు తమ ఉద్యోగుల ఖాతాలను ప్రధాన ఖాతాతో అనుబంధించవచ్చని గత నెలలో ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ తర్వాత వారి ప్రొఫైల్‌లో కంపెనీ బ్యాడ్జ్ కనిపిస్తుంది. వారిని ఐడెంటిఫై చేయడం మరింత సులభం అవుతుంది. ప్రస్తుతానికి దీనిని ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే త్వరలో ట్విటర్ ఈ కొత్త ప్రతిపాదనను తీసుకురాగలదని భావిస్తున్నారు.
ట్విట్టర్ బ్లూ సేవలకు చార్జీలు ఇప్పటికే ప్రారంభం
ట్విట్టర్‌లో బ్లూ టిక్ ఉంచడానికి ఇప్పుడు యూజర్లు దానికి ప్రత్యేక మొత్తాన్ని చెల్లించాలి. సాధారణ ట్విట్టర్‌తో పోలిస్తే యూజర్లు ట్విట్టర్ బ్లూలో అనేక సౌకర్యాలను పొందుతారు. ట్విట్టర్ బ్లూ కోసం ఐవోఎస్ వినియోగదారులు అయితే ప్రతి నెల 11 డాలర్లు చెల్లించాలి.
ట్విట్టర్ బ్లూ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్‌లలో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులు 11 డాలర్లు చెల్లించాలి. వెబ్ యూజర్లు ఎనిమిది డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. భారతదేశంలో ఇంకా ట్విట్టర్ బ్లూను ఎలాన్ మస్క్ ప్రారంభించలేదు.
క్రియేటర్లతో యాడ్ రెవిన్యూ పంచుకోవడం ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ హెడ్ ఎలాన్ మస్క్ ఇటీవలే తెలిపారు. కంటెంట్ క్రియేటర్ల రిప్లై థ్రెడ్స్‌లో కనిపించే ప్రకటనలకు ఈ ఆప్షన్ వర్తిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ కోసం ఇన్‌కం మోడల్‌ను మెరుగుపరచాలని యోచిస్తున్న ఎలాన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయం ఇది. Dogecoin (DOGE) ఆధారిత చెల్లింపులను Twitter లాంచ్ చేస్తుందని చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. అయితే దానికి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కచ్చితంగా తీసుకుని ఉండాలని తెలిపారు. ట్విట్టర్ బ్లూ సర్వీస్ డిసెంబర్ 13వ తేదీన రీలాంచ్ అయింది. మొదట ట్విట్టర్ బ్లూ లాంచ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అనేక లోపాలు తెరపైకి వచ్చాయి. వీటిని మెరుగుపరచడం కోసం కంపెనీ ఈ సర్వీసును రీలాంచ్ చేసింది.