Spyware Attack: పెగాసస్ మీ ఫోన్ పై దాడి చేసిందా.. ఇలా చెక్ చేసుకోండి
పెగాసస్ స్పైవేర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. మరి ఇలాంటి స్పైవేర్ మీ ఫోన్ పై దాడి చేసిందనే విషయాన్ని ఎలా గుర్తిస్తారు? సైబర్ నిపుణులు ఏం చెబుతున్నారు?
'నా ఫోన్ ట్యాపింగ్ చేస్తారని తెలుసు. అందుకే నేను ఫోన్లలో మాట్లాడలేకపోతున్నా. పెగాసస్ స్పైవేర్ కు భయపడి ఇదిగో ఇలా నేను నా ఫోన్ కు ప్లాస్టర్ వేసుకున్నా..' పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్న మాటలివీ. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారాన్ని ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
పెగాసస్ స్పైవేర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ అనే నిఘా కంపెనీ పెగాసస్ స్పైవేర్ టూల్‌ను అభివృద్ధి చేసింది. దీని కారణంగా దేశంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సహా పలువురు ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్ అయ్యాయనే వార్తలు రావడంతో పెగాసస్ స్పైవేర్ పేరు సంచలనంగా మారింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ వెర్షన్లపై ఇది దాడి చేస్తోందని.. ఇది ఒక్కసారి మీ ఫోన్ లోకి చొరబడితే గుర్తించడం, తొలగించడం చాలా కష్టమని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి పెగాసస్ స్పైవేర్ మీ ఫోన్ పై దాడి చేసిందనే విషయాన్ని ఎలా గుర్తిస్తారు? సైబర్ నిపుణులు ఏం చెబుతున్నారు?
- మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం తగ్గిందంటే అది హ్యాకర్ల పని అయి ఉండవచ్చు. ఓసారి ఫోన్ చెక్ చేసి ఏదైనా కొత్త యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నామా అని చూడండి. అలా ఏదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఈ యాప్ ని తొలగించినా మళ్లీ అదే సమస్య వస్తోందంటే స్పైవేర్ మీ ఫోన్ పై దాడి చేసిందని అర్థం.
- మీరు ఎప్పటిలాగానే బ్రౌజ్ చేస్తున్నా.. డేటా వినియోగం అకస్మాత్తుగా పెరిగిందంటే హ్యకర్లకు సంబంధించిన యాప్స్ ఉన్నాయని అనుమానించవచ్చు.
- మీ ఫోన్ వాడకపోయినా వేడిగా అవడం, ఫ్లాష్ లైట్ దానంతట అదే ఆన్ అవడం వంటివి జరిగినా మీ మొబైల్‌ను వేరెవరో నియంత్రిస్తున్నారని అర్థం.
- ఫోన్ బాగా స్టక్ అవుతున్నా, యాప్స్ చాలా స్లోగా ఓపెన్ అవుతున్నా, ప్రాసెసింగ్ స్పీడ్ తగ్గినా కూడా హ్యాకయినట్లు అనుమానించాల్సిందే.
- సంబంధంలేని లొకేషన్ల నుంచి మీ మెయిల్ లేదా సోషల్ మీడియా అకౌంట్లను యాక్సెస్ చేయడానికి ఎవరైనా ట్రై చేసినట్లు సందేశాలు వచ్చినా హ్యాకయినట్లు భావించాల్సిందే.
- ఫోన్లలో సంబంధం లేని పాప్ అప్స్ రావడాన్ని కూడా ఒక రకమైన హ్యాకంగ్ గానే పరిగణిస్తారు. ఈ పాప్ అప్స్ ని పొరపాటున క్లిక్ చేస్తే ఫోన్లు హ్యాకర్ల చేతిలో పడినట్లే.
- ఫొటో గ్యాలరీలు, వీడియోలలో మీరు ఎప్పుడూ తీసుకోని ఫొటోలు, వీడియోలు కనిపించాయంటే కెమెరాపై సైబర్ నేరగాళ్ల కళ్లు పడ్డాయని అర్థం. మీకు తెలియకుండానే మీ కెమెరా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిందనడానికి ఇదో అలర్ట్ లాంటిది.
- మీ ప్రమేయం లేకుండా మీ పోన్ నుంచి ఇతరులకు కాల్స్ లేదా మెసేజ్ లు వెళ్లాయంటే అది హ్యాకర్ల పనే. వెంటనే ఫోన్లలోని అనవసర యాప్స్ ను డిలీట్ చేయండి. ఇంకా మీ సమస్య పరిష్కారం అవ్వకపోతే ఫోన్ ను రీసెట్ చేయండి.