Phonepe Downloads: పేటీయంపై నిషేధం - ఫోన్‌పేకు భారీగా పెరుగుతున్న డౌన్‌లోడ్స్ - వారంలోనే 5.5 లక్షల వరకు!
Paytm Payments Bank: పేటీయం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం విధించడంతో ఫోన్‌పేకు డౌన్‌లోడ్స్ పెరిగాయి.
Paytm: పేటీయం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పేటీయంపై ఆర్బీఐ తీసుకున్న ఈ కఠినమైన చర్య సంస్థకి చాలా నష్టాన్ని కలిగించింది. అయితే భారతదేశంలో పేటీయంకు అతిపెద్ద పోటీదారు అయిన ఫోన్‌పే మాత్రం ఈ చర్య కారణంగా చాలా లాభపడింది.
ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీయం పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అటువంటి పరిస్థితిలో మిలియన్ల మంది పేటీయం వినియోగదారులు తమ ఫోన్‌ల నుండి పేటీయం యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభించారు. వినియోగదారులు తమ ఫోన్‌ల నుండి పేటీయంని అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇతర చెల్లింపు యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం ప్రారంభించారు. ఈ జాబితాలో ఫోన్‌పే ముందంజలో ఉంది.
పేటీయంకు భారీ నష్టాలు
మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ యాప్‌ట్వీక్‌లోని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ల నుండి పొందిన డేటా ప్రకారం జనవరి 24వ తేదీ నుంచి 31వ తేదీతో పోలిస్తే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య కాలంలో గూగుల్ ప్లే స్టోర్‌లో పేటీయం యాప్ రోజువారీ సగటు డౌన్‌లోడ్‌లు 1.4 లక్షలకు తగ్గాయి.
పేటీయం అతిపెద్ద ప్రత్యర్థి ఫోన్‌పే దీని నుంచి నేరుగా ప్రయోజనం పొందింది. ఈ సమయంలో ఫోన్‌పే డౌన్‌లోడ్‌లు 4.4 లక్షల నుంచి 5.5 లక్షలకు పెరిగాయి. ఫోన్‌పే కాకుండా పేటీయం యాప్‌పై తీసుకున్న చర్య నుంచి భీమ్ యాప్ కూడా చాలా ప్రయోజనం పొందింది. ఈ ఆన్‌లైన్ చెల్లింపు యాప్‌ను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో 3.6 లక్షల మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ రెండు కాకుండా గూగుల్ పే యాప్ డౌన్‌లోడ్‌ల సంఖ్య కూడా రెండు లక్షలకు చేరుకుంది. యాప్‌ట్వీక్ డౌన్‌లోడ్ అంచనా ఖచ్చితత్వ రేటు దాదాపు 85 నుంచి 90 శాతం వరకు ఉంటుందని తెలిపింది.
ఫోన్‌పేకు భారీ ప్రయోజనాలు
యాప్‌ట్వీక్ భారత హెడ్ కరణ్ లఖ్వానీ మీడియాతో మాట్లాడుతూ యాప్ డౌన్‌లోడ్‌లలో ఫోన్‌పే వాటా ఇప్పటికే పెరుగుతోందన్నారు. పేటీయం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆదేశం తర్వాత జనవరి 31వ తేదీ నుంచి ఫోన్‌పే కోసం డౌన్‌లోడ్‌ల సంఖ్య మరింత వేగంగా పెరిగింది. పేటీయం, ఫోన్‌పేతో పోలిస్తే మొబీక్విక్ చాలా చిన్న సంస్థ. కానీ ఈ యాప్‌కి సగటున 45,000 రోజువారీ డౌన్‌లోడ్‌లు కూడా అవుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య యాపిల్ యాప్ స్టోర్‌లో పేటీయం సగటు రోజువారీ డౌన్‌లోడ్ సుమారు ఎనిమిది వేలు కాగా, ఫోన్‌పే సగటు రోజువారీ డౌన్‌లోడ్ 25,000 అని డేటా చూపిస్తుంది. యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్ కలిపి ఫోన్‌పేకి దాదాపు 40 లక్షల డౌన్‌లోడ్‌లు వచ్చాయి. ఇది ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. మొత్తం 25 లక్షల డౌన్‌లోడ్‌లను పొందిన భీమ్ యాప్ రెండో స్థానంలో ఉంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?