OnePlus Nord CE 2 5G: వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్ వచ్చేది ఆరోజే.. తక్కువ ధరలోనే బ్రాండెడ్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ నార్డ్ సీఈ 2 5జీని ఫిబ్రవరి 17వ తేదీన లాంచ్ చేయనుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఫిబ్రవరి 17వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్‌ను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్‌లో కూడా ఈ ఫోన్ కనిపించింది. అయితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ గురించి రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను కూడా కంపెనీ విడుదల చేసింది. పవర్ బటన్ ఫోన్‌కు కుడివైపు, వాల్యూమ్ కంట్రోల్ బటన్లు ఫోన్‌కు ఎడమవైపు ఉండనున్నాయి. ఈ టీజర్ వీడియోలో అలెర్ట్ స్లైడర్ బటన్‌ను కంపెనీ అందించినట్లు కనిపించలేదు. గతంలో వచ్చిన రెండర్ల తరహాలోనే దీని డిజైన్ ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఉండనున్నాయి. 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా అందించనున్నారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. గతంలో వచ్చిన వన్‌ప్లస్ ఫోన్లలో కంపెనీ ఈ ఫీచర్‌ను అందించలేదు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్‌లోనే బీఐఎస్ వెబ్‌సైట్లో కనిపించింది. కంపెనీ వెబ్ సైట్ సోర్స్ కోడ్‌లో కూడా ఈ ఫోన్ కనిపించింది.
గతంలో వచ్చిన రెండర్ల ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీలో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుందని తెలుస్తోంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ కెమెరా కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
ఫిబ్రవరి 17వ తేదీన లాంచ్ కానున్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్ల గురించి కంపెనీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. రానున్న రోజుల్లో దీని గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
View this post on Instagram