సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువ చేస్తారా? ఈ తప్పు చేస్తే ఏకంగా రూ.50 లక్షలు ఫైన్!
సోషల్ మీడియాలో రీల్స్ షేర్ చేసేటప్పుడు ఈ తప్పు చేస్తే రూ.50 లక్షలు ఫైన్ పడే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే యాప్‌లలో Facebook, WhatsApp, Instagram, Twitter మొదలైనవి ఉన్నాయి. సోషల్ మీడియా అంటే ఈ యాప్సే. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదా ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిని ఇన్‌ఫ్లుయెన్సర్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తుల ప్రభావం ఆయా యాప్‌ల యూజర్లపై కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి సోషల్ మీడియాను ప్రభావితం చేసే వారిపై రూ.50 లక్షల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మీరు మీ ఫాలోవర్లకు పెయిడ్ ప్రమోషన్ గురించి సమాచారం ఇవ్వకుంటే, మీపై చర్యలు తీసుకోవచ్చు.
పెయిడ్ ప్రమోషన్ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది
సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు, వారు విభిన్న ఉత్పత్తులను సమీక్షించడం లేదా ప్రచారం చేయడం మీరందరూ చూసే ఉంటారు. కాలంతో పాటు ప్రకటనల విధానం కూడా మారిపోయింది. కంపెనీలు లేదా పెద్ద బ్రాండ్‌లు ఇప్పుడు ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను సంప్రదిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉత్పత్తిని ప్రమోట్ చేయడానికి కంపెనీలు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ను సంప్రదించినప్పుడు, ఆ వ్యక్తి తాను చేసేది ప్రమోషన్ అని ఫాలోవర్లకు తెలియజేయాలి. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న నిబంధన ద్వారా వీటిని కంపల్సరీ చేయనున్నారు.
ఇన్‌ఫ్లుయెన్సర్‌లు విభిన్న ఉత్పత్తులను విచక్షణారహితంగా ప్రచారం చేయడం కూడా మీరు చాలాసార్లు చూసి ఉంటారు. వారు తమ ఫాలోవర్లను ఉత్పత్తిని కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తారు. సాధారణ ప్రజానీకం ఇన్‌ఫ్లుయెన్సర్ మాటలకి పడిపోయి, ఉత్పత్తిని ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఇది కంపెనీ, ఇన్‌ఫ్లుయెన్సర్ ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు రూపొందించలేదు. కానీ ఇప్పుడు ఈ పద్ధతికి స్వస్తి చెప్పేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త నిబంధన కేవలం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు, ఎకనమిక్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా వర్తిస్తుంది.
రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది?
ఏదైనా ప్లాట్‌ఫారమ్‌లో ప్రమోషన్ గురించి ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఫాలోవర్లకు తెలియజేయాలి. అలా చేయకపోయినా లేదా పెయిడ్ ప్రొడక్ట్స్ గురించి చెప్పకపోయినా, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPAకి ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
పన్ను చెల్లించాలి
కొత్త నిబంధన ప్రకారం ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ప్రమోట్ చేసే ఉత్పత్తిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కంపెనీ లేదా బ్రాండ్ ఇచ్చిన ఉత్పత్తిని ఇన్‌ఫ్లుయెన్సర్ తానే ఉంచుకుంటే, అతను దానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే అతను ఉత్పత్తిని సమీక్షించి కంపెనీకి తిరిగి ఇస్తే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఒక కంపెనీ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఉత్పత్తిని ఇస్తే, దానిపై ఎటువంటి పన్ను వసూలు చేయలేదు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?