Machine Learning: తెలుగు యువత భవిష్యత్తుకు దారి చూపే AI టెక్నాలజీ! అవకాశాలు, కోర్సులు, నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే !
మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను మనం తెలియకుండానే చాలా విషయాల్లో వాడుతున్నాం. ప్రస్తుతం మనం వాడుతున్న సిరి, అలెక్సా (Alexa), గూగుల్ అసిస్టెంట్ వంటివి మనం చెప్పే మాటలను అర్థం చేసుకుని స్పందిస్తున్నాయి.

Machine Learning: మనుషులు అనుభవం ద్వారా నేర్చుకున్నట్లు కంప్యూటర్లు కూడా స్వీయ అనుభవం ద్వారా నేర్చుకోగలవని ఎంత మందికి తెలుసు? అవును, నిజమే. కంప్యూటర్లలో ఈ విప్లవాత్మక సాంకేతికతను మెషిన్ లెర్నింగ్ (Machine Learning - ML) అంటారు. ఇది ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్న కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) లో భాగమే. ఇందులో ఉండేవి ఏంటంటే: డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, స్మార్ట్ సిస్టమ్స్, ఆటోమేషన్ వంటివి ఈ రంగంలో ఊహించని మార్పులను తెస్తున్నాయి. ఇప్పుడు దీనిపై మన తెలుగు యువత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా అపారమైన అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ కథనం మొత్తం చదివితే మెషిన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అవగతం అవుతుంది.
డేటా నుంచి కంప్యూటర్ల అభ్యాసమే మెషిన్ లెర్నింగ్
కంప్యూటర్ పని చేయాలంటే ముందుగా ప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే, మెషిన్ లెర్నింగ్‌లో స్పష్టమైన ప్రోగ్రామింగ్ లేకుండానే కంప్యూటర్‌కు ఇచ్చిన డేటా నుంచి స్వయంగా నేర్చుకుని, భవిష్యత్తు నిర్ణయాలను కంప్యూటర్ తీసుకోవడమే మెషిన్ లెర్నింగ్ సాంకేతికత. ప్రస్తుతం కంప్యూటర్ ఏ పని చేయాలన్నా దానికి ముందుగా ప్రోగ్రామింగ్ చేసి ఇవ్వాలి. కానీ, కంప్యూటర్‌కు మనం ఇచ్చే బిగ్ డేటా ఇస్తే చాలు, ఆ డేటాను పరిగణలోకి తీసుకుని స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ డేటా ఆధారంగా తనే ఓ నమూనాను రూపొందిస్తుంది. వివరంగా చెప్పాలంటే, మీరు కొనే వస్తువుల సమాచారం తీసుకుని కంప్యూటర్ మీకు నచ్చే అలాంటి మరికొన్ని వస్తువులను కొనేందుకు సిఫార్సు చేస్తుంది. అంతే కాకుండా, మొబైల్ ఫోన్లలో మన ముఖాన్ని గుర్తుపట్టి లాక్ ఓపెన్ చేయడం మెషిన్ లెర్నింగ్‌లో భాగమే. ఈ మెషిన్ లెర్నింగ్‌లో మోడల్‌లో లోపాలు లేదా పొరపాట్లు ఎదురైతే, కంప్యూటర్లు కూడా ఆ తప్పులు సరిదిద్దుకుని తమ పని తీరును మెరుగుపరుచుకుంటాయి. మెషిన్ లెర్నింగ్‌లోని సాంకేతికతకు వీటిని ఉదాహరణగా చెప్పవచ్చు.
మానవ జీవితంలో మెషిన్ లెర్నింగ్ పాత్ర ఎలా ఉందో తెలుసా?
మెషిన్ లెర్నింగ్ అనే సాంకేతికతను మనం తెలియకుండానే చాలా విషయాల్లో వాడుతున్నాం. ప్రస్తుతం మనం వాడుతున్న సిరి, అలెక్సా (Alexa), గూగుల్ అసిస్టెంట్ వంటివి మనం చెప్పే మాటలను అర్థం చేసుకుని మనం అడిగినట్లు స్పందిస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో మీ స్నేహితుల ఫోటోలను గుర్తుపట్టడం, స్మార్ట్ ఫోన్‌లలో ఫేషియల్ రికగ్నిషన్ వంటివి ఉన్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో మీరు ఓ థ్రిల్లర్ మూవీ చూశారనుకోండి, అలాంటి సినిమాలను తిరిగి మీ అభిరుచికి తగ్గట్టు సిఫార్సు చేస్తాయి. అమెజాన్‌లో మీరు ఓ వస్తువు కొనుక్కుంటే, అలాంటి వస్తువుల జాబితా, వాటికి సంబంధించిన ఇతర వస్తువుల జాబితాను చూపిస్తాయి. ప్రస్తుతం టెస్లా కార్లు డ్రైవర్ లేకుండానే అమెరికా లాంటి దేశాల్లో ప్రయాణిస్తున్నాయి. వాహనం చుట్టూ ఉన్న వాతావరణం, ట్రాఫిక్‌ను, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అర్థం చేసుకుని కారు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తుందంటే అది మెషిన్ లెర్నింగ్ సాంకేతికతనే. బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలు, మోసాలను గుర్తించడంలో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. గూగుల్ ట్రాన్స్‌లేట్, చాట్‌బాట్‌లు, స్మార్ట్ రిప్లైల వంటి వాటిలో మెషిన్ లెర్నింగ్ కీలకం. అంతే కాకుండా, వైద్యరంగంలో ఎక్స్-రేలు, ఎం.ఆర్.ఐలు వంటి వాటిని విశ్లేషించడం, వ్యాధి నిర్ధారణలో సహాయం చేయడం, మందుల అభివృద్ధిలోనూ ఈ మెషిన్ లెర్నింగ్ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవసాయం (Agriculture) నుండి అంతరిక్ష (Space) పరిశోధనల వరకు మెషిన్ లెర్నింగ్ సాంకేతికత ఉపయోగపడుతుంది.
తెలుగు యువతకు అవకాశాల గని: మెషిన్ లెర్నింగ్ కోర్సులు
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలు ఐటీ, టెక్నాలజీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్ రంగాలకు ముఖ్య కేంద్రాలుగా అవతరించాయి. హైదరాబాద్, విశాఖపట్నం వంటివి టెక్నాలజీ హబ్‌లుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇలాంటి తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల యువతకు మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలో నిపుణులుగా మారితే ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు పొందనున్నారు. హైదరాబాద్ మన దేశంలో అతి పెద్ద రెండో ఐటీని ఎక్స్‌పోర్ట్ చేసే సెంటర్‌గా అవతరించింది. విశాఖపట్నం కూడా ఐటీ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ వంటి కంపెనీలు తమ కార్యాలయాలను, డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్రముఖ కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల్లోనూ, అందించే సేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. టీ-హబ్ వంటి ఇంక్యుబేటర్లకు తెలంగాణ కేంద్రంగా మారింది. ఏపీలోనూ కొత్త స్టార్టప్‌లను అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ స్టార్టప్‌లలో AI ఆధారిత సాంకేతికతను విరివిగా వినియోగిస్తారు. ఈ రంగాల్లో ఎదురయ్యే సాంకేతికత సమస్యల పరిష్కారానికి AI, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీనే కీలకం. ఇందులో నిపుణులైన యువ ఇంజనీర్లకు, డేటా సైంటిస్టులకు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన అవకాశాలు దక్కనున్నాయనడంలో సందేహం లేదు.
ఇందులో నిపుణులు కావాలంటే ఏం నేర్చుకోవాలి?
మన తెలుగు విద్యార్థులు, యువత ఈ రంగంలో నిపుణులు కావాలంటే పైథాన్ (Python), R వంటి ప్రోగ్రామింగ్ భాషలపై పట్టు ఉండాలి. ఇందుకోసం ఈ కోర్సుల్లో చేరి నైపుణ్యం సాధించాలి. యూనివర్సిటీ డిగ్రీలతో పాటు డేటా సైన్స్ (Data Science), స్టాటిస్టిక్స్ (Statistics), అల్గారిథమ్స్ (Algorithms) వంటి ప్రాథమిక అంశాలపై, అలాగే TensorFlow, PyTorch వంటి ML ఫ్రేమ్‌వర్క్‌లపై అవగాహన పెంచుకోవాలి. తమ నైపుణ్యంతో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, AWS వంటి సంస్థలు అందించే క్లౌడ్-ML సర్టిఫికేషన్లు ఈ రంగంలో అవకాశాలు పొందడానికి ఉపయోగపడతాయి. ఈ రంగంలో మెషిన్ లెర్నింగ్ నిపుణులకు ఇంజనీర్ (Engineer), డేటా సైంటిస్ట్ (Data Scientist), మెషిన్ లెర్నింగ్ రిసర్చర్ (Machine Learning Researcher), బిగ్ డేటా అనలిస్ట్ (Big Data Analyst), AI ఆర్కిటెక్ (AI Architect) వంటి ఉద్యోగాలు పొందవచ్చు. ఐటీ రంగంలో మాత్రమే కాకుండా విద్య (Education), వైద్య (Medical), ఆర్థిక (Financial), రక్షణ (Defense), వ్యవసాయ (Agriculture), రిటైల్ (Retail) రంగాల్లోనూ ఈ నిపుణులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి.
ఈ రంగంపై మక్కువ ఉంటే వెంటనే పైన చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటే తెలుగు యువత అపారమైన అవకాశాలను దక్కించుకోవచ్చు. తద్వారా వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగానూ, ఆర్థిక వృద్ధికి తెలుగు యువత తోడ్పడినట్లు అవుతుంది.






















