Direct To Mobile: సిమ్, ఇంటర్నెట్ లేకుండానే మొబైల్లో ఫ్రీగా టీవీ చూడొచ్చు- గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Videos Without SIM card: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక అన్నీ అరచేతిలో చూసే పరిస్థితి వచ్చింది. ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. టీవీ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.
Videos Without SIM card: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక అన్నీ అరచేతిలో చూసే పరిస్థితి వచ్చింది. ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. టీవీ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఫోన్‌లో ఈ రెండూ ఉండాలంటే ముందు మన జేబులో డబ్బులు ఉండాలి. అయితే అవేవీ లేకుండా మొబైల్లో ఫ్రీగా టీవీ చూసేయొచ్చు. కేంద్రం ఈ తరహా టెక్నాలజీని తయారు చూస్తోంది. డీ2హెచ్ తరహలో డీ2ఎంను సాంకేతికతను రూపొందిస్తోంది. ఇదే అందుబాటులోకి వస్తే ఫోన్‌లో సిమ్ కార్డు, దాంట్లో ఇంటర్నెట్ లేకుండా ఫ్రీగా టీవీ చూసేయొచ్చు.
కేంద్రం మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్నెట్ లేకుండా ప్రీగా టీవీ చూసేలా డీ2ఎం టెక్నాలజీని కేంద్రం తయారు చేస్తోందని సమాచార, ప్రసార శాఖా కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. బ్రాడ్‌కాస్టింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. స్వదేశీ ఉత్పత్తి డైరెక్ట్-టు-మొబైల్ (D2M) సాంకేతికతను వృద్ధి చేసినట్లు చెప్పారు. త్వరలో 19 నగరాల్లో దీనిని సంబంధించి ట్రయల్స్ జరుగుతాయని వెల్లడించారు. ఇందు కోసం 470-582 MHz స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేసినట్లు తెలిపారు.
వీడియో ట్రాఫిక్‌ను 25-30 శాతం డీ2ఎంకి మార్చడం ద్వారా 5జీ నెట్‌వర్క్‌లపై భారం తగ్గుతుందని, దేశంలో డిజిటల్ రంగాన్ని వేగవంతం చేస్తుందని, కంటెంట్ డెలివరీని అందుబాటులోకి తీసుకువస్తుందని చంద్ర చెప్పారు. గత సంవత్సరం, డీ2ఎం సాంకేతికతను పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, కర్తవ్య పథ్, నోయిడాలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు వెల్లడించారు.
డీ2ఎం టెక్నాలజీ దేశవ్యాప్తంగా దాదాపు 8-9 కోట్లకు టీవీని చేరువ చేస్తుందని చంద్ర తెలిపారు. దేశంలోని 280 మిలియన్ల కుటుంబాలలో కేవలం 190 మిలియన్లకు మాత్రమే టెలివిజన్ సెట్లు ఉన్నాయని అన్నారు. దేశంలో 80 కోట్ల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని, 69 శాతం కంటెంట్ వీడియో ఫార్మాట్‌లోనే ఉందని చెప్పారు. వీడియోను చూసే సమయంలో మొబైల్ నెట్‌వర్క్‌లు అడ్డుపడతాయని, ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని చంద్ర చెప్పారు.
సాంఖ్య ల్యాబ్స్, IIT కాన్పూర్ అభివృద్ధి చేసిన డీ2ఎం సాంకేతికత ప్రసార రంగం చరిత్రలో నిలిచిపోతుందని చంద్ర అన్నారు. ఈ ప్రసార సాంకేతికత టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్-అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా మొబైల్, స్మార్ట్ పరికరాలకు ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. డీ2ఎం సాంకేతిక పరిజ్ఞానంతో డేటా ట్రాన్స్‌మిషన్, యాక్సెస్‌లో ఖర్చు తగ్గుతాయని, నెట్‌వర్క్ సామర్థ్యం పెరుగుతుందని, అలాగే దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటుకు దోహదపడుతుందన్నారు.