BGMI: బీజీఎంఐ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమ్ ఏప్రిల్ 29వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
BGMI Update: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) మీద నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత, గేమర్‌లు సంతోషంగా ఉన్నారు. ఈ గేమ్‌ను ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే, ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి బీజీఎంఐ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇంతలో బీజీఎంఐ తన వినియోగదారుల కోసం ఒక పెద్ద అప్‌డేట్‌ను షేర్ చేసింది.
ఈ గేమ్ ప్రీ-లోడింగ్‌కు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని, మే 29వ తేదీ నుంచి ప్రజలు ఐవోఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గేమ్ ఆడవచ్చని తెలిపింది. అంటే డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందన్న మాట. ఈ విషయాన్ని కంపెనీ ట్వీటర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
బీజీఎంఐపై మూడు నెలల తాత్కాలిక ఆమోదాన్ని భారత ప్రభుత్వం అందించింది. ఈ సమయంలో అధికారులు ఈ ఆటపై నిఘా ఉంచుతారు. ఒకవేళ గేమ్ నిర్వాహకులు ఏదైనా నియమాన్ని ఉల్లంఘిస్తే దీన్ని మళ్లీ నిషేధించే అవకాశం ఉంది.
సర్వర్ లొకేషన్‌లు, డేటా భద్రత తదితర అంశాల్లో నిబంధనలను పాటిస్తామని కంపెనీ చెప్పడంతో బీజీఎంఐకి మూడు నెలల తాత్కాలిక అనుమతి లభించిందని ఈ సమయంలో ప్రభుత్వం గేమ్‌పై నిఘా ఉంచి తుది నిర్ణయం తీసుకుంటుందని ఐటీ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు.
గేమ్‌లో కొత్త రూల్స్
బీజీఎంఐ కొన్ని కొత్త నిబంధనలతో తిరిగి వచ్చింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు వారి తల్లిదండ్రుల ద్వారా గేమ్‌కు లాగిన్ అవ్వాలి. అలాగే గేమర్‌లు ఓటీపీ ద్వారా మాత్రమే లాగిన్ చేయగలరు. గేమ్ డెవలపర్ అయిన క్రాఫ్టన్ కూడా 18 ఏళ్లలోపు పిల్లలకు ఇందులో పరిమితి విధించారు. వారు రోజులో మూడు గంటలు మాత్రమే గేమ్ ఆడగలరు. గతంలో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను గేమ్ విషయంలో ఇబ్బంది పెట్టినందున ఈ పరిమితి విధించబడింది.
ఇది కాకుండా గేమర్‌లు ఒక రోజులో కేవలం రూ.7,000 మాత్రమే గేమ్‌లో పెట్టుబడి పెట్టగలరు. పిల్లలు వీటికి అలవాటు పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలను రూపొందించారు.
అయితే ఈ గేమ్ కారణంగా గతంలో కొన్ని దారుణాలు కూడా జరిగాయి. పబ్‌జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించినందుకు లఖ్‌నవూలోని ఓ బాలుడు కన్నతల్లినే కాల్చి చంపాడు. ఆర్మీలో పని చేసే తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో తల్లిని హత్య చేయటం సంచలనమైంది. పబ్‌జీ పనైపోయిందనుకుంటున్న తరుణంలో మరోసారి ఈ ఘటన జరగటం అందరినీ ఆందోళనకు గురి చేసింది. హత్య చేసిన తరవాత దాదాపు మూడు రోజుల పాటు శవంతో ఇంట్లోనే ఉండిపోయాడు ఆ బాలుడు. పొరుగింటి వాళ్లకు అనుమానం రాకుండా రూమ్ ఫ్రెష్‌నర్స్ వినియోగించాడు.
పబ్‌జీ కారణంగా ఇలాంటి నేరాలు జరగటం ఇదే తొలిసారేమీ కాదు. 2022 జనవరిలో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ 14 ఏళ్ల బాలుడు పబ్‌జీ మత్తులో పడిపోయాడు. ఆడొద్దని వారించినందుకు కుటుంబ సభ్యుల్ని తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటన. భారత్‌లోనూ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం వల్ల కేంద్రం బ్యాన్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో నిర్వహించిన సందర్భంలో ఓ తల్లి తన కుమారుడు పబ్‌జీకి బానిసైపోయాడంటూ వాపోయింది. పబ్‌జీ వాలా హై క్యా అంటూ ప్రధాని నరేంద్రమోదీ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ సమస్య తీవ్రమవుతూనే వచ్చింది.