iPhone Price Hike: ట్రంప్ కొత్త సుంకాలతో ఆపిల్ కంపెనీకి బిగ్ షాక్, పెరగనున్న ఐఫోన్ ధరలు !
Trump Tarrifs on India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయం వల్ల భారత్ లో ఉత్పత్తి పెంచుకుంటున్న Apple వ్యాపారానికి ఎదురుదెబ్బ తగల నుంది.

US Tariffs On India: భారతదేశం, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరిగి ప్రకటన వస్తుందనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మిత్ర దేశం అంటూనే భారతదేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం అమెరికాకు ఎగుమతులు చేసే పలు పరిశ్రమ వర్గాలకు ఆందోళన కలిగించింది. భారతదేశంలో ఎగుమతి కేంద్రాన్ని బిల్డ్ చేయాలనే ఆకాంక్షతో వేగంగా ఉత్పత్తిని పెంచుకుంటున్న Apple సంస్థకు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ప్రకటనతో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇది భారతదేశంలో Apple ఉత్పత్తితో పాటు ఎగుమతి అంశాలపై సైతం ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
అంతేకాకుండా, భారతదేశం రక్షణ పరికరాలు, ఇంధనం విషయంలో రష్యాపై ఆధారపడుతోంది. ఆ దేశం నుంచి భారత్ దిగుమతులు చేసుకుంటున్న కారణంగా మన దేశంపై అదనపు టారిఫ్‌లు విధించాలని భావిస్తున్నట్లు కూడా ప్రకటించారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం భారత మార్కెట్లను నేరుగా ప్రభావితం చేస్తుంది. దాని ఫలితంగా దిగ్గజ కంపెనీ Apple తన ఐఫోన్ సహా ఇతర ఉత్పత్తుల ధరలను పెంచక తప్పదు.
Apple వ్యాపారానికి ఎదురుదెబ్బ
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అమెరికాకు 14 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్, 10.5 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు, 4.09 బిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇంతకు ముందు ఆ రంగాలపై ఎలాంటి సుంకాలు లేవు. అయితే, డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఎగుమతి చేసే విదేశాలపై సుంకాల పరిధి పెంచడంతో యాపిల్ సంస్థపై సైతం ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాని ఫలితంగా యాపిల్ కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను త్వరలో పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ చేసిన టారిఫ్ ప్రకటనపై అధికారిక ఉత్తర్వులు వచ్చాక క్లారిటీ రానుంది.
భారతదేశం మిగతా దేశాలతో పోల్చితే విదేశాలపై భారీగా సుంకాలు వసూలు చేస్తుందని ట్రంప్ అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ పౌరులపై దాడులు చేస్తున్న రష్యాకు భారత్ ఆర్థికసాయం చేస్తుందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి రక్షణ పరికరాలు, ముడి చమురు ఇంధనం కొనుగోళ్లు చేయడం అంటే ఆ దేశానికి భారత్ ఆర్థిక సహకారం అందించడమేనని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.
రెగ్యులర్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ (ప్లస్ మోడల్), ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ సహా అన్ని ఐఫోన్ 17 స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగనున్నాయి. ఐఫోన్ 17 అన్ని మోడల్ ఫోన్లు 50 డాలర్ల మేర ధర పెరగనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుత ఐఫోన్ మోడల్స్ బేస్ ఐఫోన్ 16 మోడల్ 799 డాలర్లకు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 1,199 డాలర్లకు బేస్ మోడల్స్ ఉన్నాయి.
2025 రెండవ త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాలు భారీగా జరిగాయని పేర్కొంటూ AAPL స్టాక్‌కు హోల్డ్ రేటింగ్ ఇచ్చింది. అమెరికా టెలికమ్యూనికేషన్ కంపెనీలు 22% వార్షిక పరికరాల వృద్ధిని సాధించాయి. గత ఆరు త్రైమాసికాలలో ఇది అక్కడ అత్యధికం. మరోవైపు భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్లు ఎగుమతి సైతం పెరగడం తెలిసిందే.






















