Apple App Store: ఐఫోన్ యూజర్ల డబ్బును కాపాడుతున్న యాపిల్ - ఏకంగా రూ.11 వేల కోట్లు పైగా!
2021లో యాపిల్ 1.5 బిలియన్ డాలర్లకు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.11,621.5 కోట్లు) సంబంధించిన మోసపూరితమైన లావాదేవీలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
సైబర్ క్రైమ్‌లు, స్మార్ట్ ఫోన్ యాప్‌ల ద్వారా బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు గల్లంతు అవ్వడం వంటి వార్తలు మన రోజువారీ జీవితంలో భాగం అయిపోయాయి. ఇలాంటివి విన్నప్పుడు మనం అయ్యో అనుకుంటాం. మన పనుల్లో మునిగిపోతాం. కానీ డబ్బులు పోగొట్టుకున్న వారిని మాత్రం ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. కానీ యాపిల్ మాత్రం తన ఖాతాదారులకు సంబంధించిన వేల కోట్ల సొమ్ము సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఆపింది.
2021 సంవత్సరానికి యాపిల్ యాన్యువల్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అనాలసిస్ నివేదికను విడుదల చేసింది. దీన్ని బట్టి యాపిల్ గతేడాది 1.5 బిలియన్ డాలర్లకు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.11,621.5 కోట్లు) సంబంధించిన మోసపూరితమైన లావాదేవీలను నిలిపి వేసింది. అలాగే వినియోగదారులను మోసం చేసే 16 లక్షల రిస్కీ యాప్స్‌ను తన స్టోర్ నుంచి తొలగించింది. యాపిల్ ఫోన్ల ద్వారా బ్లాక్ రిక్వెస్ట్ పెట్టిన 33 లక్షల క్రెడిట్ కార్డులను సకాలంలో బ్లాక్ చేయించగలిగింది. 17 కోట్ల మోసపూరితమైన వినియోగదారుల ఖాతాలను డీయాక్టివేట్ చేసింది.
పలు దశల్లో సాగే యాప్ రివ్యూ ఆటోమేటెడ్ ప్రాసెస్ అని యాపిల్ తెలిపింది. ఇందులో మెషీన్ లెర్నింగ్‌తో పాటు మాన్యువల్ హ్యూమన్ రివ్యూ కూడా ఉంటుందని పేర్కొంది. ఈ అన్ని పరీక్షల్లోనూ అప్రూవ్ అయితేనే యాప్ స్టోర్‌లో లిస్ట్ చేస్తామని ప్రకటన ద్వారా తెలిపింది.
2021లో దాదాపు 1.07 లక్షల మంది కొత్త డెవలపర్లు తమ యాప్స్‌ను యాప్ స్టోర్‌లో లిస్ట్ చేసుకున్నారని పేర్కొంది. అలాగే 8.02 లక్షల ఫ్రాడ్ డెవలపర్ల అకౌంట్లను తొలిగించింది. 8.35 లక్షల కొత్త యాప్స్‌ను, 8.05 లక్షల అప్‌డేట్స్‌ను రిజెక్ట్ చేసింది. 1.57 లక్షల యాప్స్‌ను స్పామ్, కాపీ యాప్స్, వినియోగదారులను మోసపుచ్చే యాప్స్ అనే కారణంతో స్టోర్‌లో ఉంచడానికి నిరాకరించింది.
ఆండ్రాయిడ్ ఫోన్ల తరహాలో డెడికేటెడ్ యాప్ స్టోర్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ యాప్స్‌ను ఐఫోన్లలో ఇన్‌స్టాల్ చేయడానికి కుదరదు. దీని గురించి యాపిల్ ఎప్పుడూ విమర్శల పాలవుతూ ఉంటుంది. కానీ వినియోగదారుల ప్రైవసీ కారణంగా యాపిల్ ఎన్ని విమర్శలు ఎదురైనా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఐఫోన్ యూజర్ల డేటా, ప్రైవసీనే తమకు ముఖ్యమని ఎన్నో సార్లు తెలిపింది. యాపిల్‌కు ప్రత్యేకంగా యాపిల్ పే, స్టోర్ కిట్, ఇన్ యాప్ పేమెంట్స్, సబ్‌స్క్రిప్షన్లు వంటి పేమెంట్ టెక్నాలజీలు కూడా ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!