WPL 2023: మహిళల ఐపీఎల్‌కి మెరుపు ఆరంభం - భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్!
గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
Gujarat Giants vs Mumbai Indians Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (65: 30 బంతుల్లో, 14 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అయితే ముంబైకి ఆశించిన ఆరంభం లభించలేదు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఓపెనర్ యస్తిక భాటియా (1: 8 బంతుల్లో) మూడో ఓవర్లో అవుట్ అయింది.
మరో ఓపెనర్ హీలీ మ్యాథ్యూస్ (47: 31 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ నటాలీ స్కీవర్ బ్రంట్ (23: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అయితే ఒక్క ఓవర్ వ్యవధిలోనే వీరిద్దరూ అవుటయ్యారు. దీంతో 10 ఓవర్లలో 77 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది.
కానీ అసలు ఆట అప్పుడే మొదలైంది. ప్రస్తుత భారత జట్టుకు, అలాగే ముంబై ఇండియన్స్‌కు కూడా కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ (65: 30 బంతుల్లో, 14 ఫోర్లు) చెలరేగి ఆడింది. గుజరాత్ బౌలర్లపై స్వీప్ షాట్లతో విరుచుకుపడింది. అగ్నికి వాయువు తోడౌనట్లు హర్మన్ ప్రీత్ కౌర్‌కు అమీలియా కెర్ (45 నాటౌట్: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) తోడైంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు.
హర్మన్ ప్రీత్ చేసిన 65 పరుగుల్లో 56 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి. 17వ ఓవర్ చివరి బంతికి హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయింది. కానీ చివర్లో పూజా వస్త్రాకర్ (15: 8 బంతుల్లో, మూడు ఫోర్లు), ఇసీ వాంగ్ (6 నాటౌట్: ఒక బంతి, ఒక సిక్సర్) స్కోరు వేగం తగ్గనివ్వలేదు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణాకు రెండు వికెట్లు దక్కాయి.
ఈ మొదటి మ్యాచ్‌ను మొత్తం సీజన్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కలిగి ఉన్న స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఈ మ్యాచ్ ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్‌ను జియో సినిమా యాప్, వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. మ్యాచ్‌ను 4కే స్ట్రీమింగ్ చేసే అవకాశం కూడా ఉంది.
ముంబై ఇండియన్స్ వుమెన్ (ప్లేయింగ్ XI)
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, జింటిమణి కలిత, సైకా ఇషాక్
గుజరాత్ జెయింట్స్ (ప్లేయింగ్ XI)
బెత్ మూనీ(కెప్టెన్, వికెట్ కీపర్), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాళన్ హేమలత, జార్జియా వేర్‌హామ్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మాన్సీ జోషి