WPL 2023 Auction: మహిళల ఐపీఎల్ వేలం త్వరలోనే - ఎప్పుడు జరగనుందంటే?
మహిళల ప్రీమియం లీగ్ వేలం ఫిబ్రవరిలో జరగనుందని తెలుస్తోంది.
WPL Players Auction: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి రెండో వారంలో జరగనుందని సమాచారం. మీడియా కథనాల ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీ, 11వ తేదీల్లో న్యూఢిల్లీలోని ఒక హోటల్‌లో ఈ వేలం (WPL Auction) నిర్వహించాలని దాదాపు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలు తమ జట్ల కోసం ఆడే ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి.
ఇటీవలే WPL కోసం జట్లను వేలం వేశారు. తొలి సీజన్‌లో మొత్తంగా ఐదు జట్లు ఆడనున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ ఐదు ఫ్రాంచైజీలను కొనుగోలు చేయడానికి 17 కంపెనీల మధ్య పోటీ ఏర్పడింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఒక్కో ఫ్రాంచైజీని దక్కించుకున్నాయి. మిగతా రెండు టీమ్‌లను అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్, కాప్రి గ్లోబల్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఈ ఐదు టీమ్‌లను మొత్తంగా రూ.4,670 కోట్లకు విక్రయించారు.
ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీకి తలో రూ.12 కోట్ల వరకు పర్స్ అందుబాటులో ఉండనుంది. ఈ నగదులోనే ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. ఒక్కో జట్టులో 15 నుంచి 18 మంది వరకు ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. వీరిలో విదేశీ ప్లేయర్స్ గరిష్టంగా ఏడుగురు వరకు మాత్రమే ఉండవచ్చు.
ఐదుగురు విదేశీ ప్లేయర్స్ తుది జట్టులో ఆడగలరు. అయితే అందులో ఒకరు తప్పనిసరిగా అసోసియేట్ కంట్రీ ప్లేయర్ అయి ఉండాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల కోసం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో ఒక కేటగిరీ ఉందని, క్యాప్డ్ ప్లేయర్‌ల కోసం రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో కేటగిరీలను తయారు చేస్తారని వార్తలు వస్తున్నాయి.
మహిళల ఐపీఎల్ తొలి సీజన్ మార్చి 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగాల్సి ఉంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే డబ్ల్యూపీఎల్ ఫైనల్ కూడా ముగిసిపోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల వేలం, జట్ల పేర్లు, జెర్సీల వరకు ఇంకా అనేక విషయాలు తెరపైకి రావాల్సి ఉంది. అయితే సమయం తక్కువగా ఉన్నందున, ఫిబ్రవరి నెల డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీలకు, బీసీసీఐకి చాలా బిజీగా ఉండనుంది.
ఫ్రాంచైజీల కోసం ముంబయిలో వేలం జరిగింది. ఇందులో వచ్చిన సీల్డ్ బిడ్లను తెరవడంతో బీసీసీఐకి రూ.4,669 కోట్ల డబ్బు సమకూరింది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ అత్యధికంగా రూ.1289 కోట్లకు అమ్ముడుపోయింది. రూ.912 కోట్లతో ముంబయి రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరు రూ.901 కోట్లు, ఢిల్లీ రూ.810 కోట్లు, లక్నో రూ.757 కోట్లతో బిడ్లు వేశాయి.
మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ఇంతకు ముందే పూర్తైంది. రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్ 18 ఐదేళ్ల కాలానికి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ.951 కోట్లు చెల్లిస్తోంది. అంటే 2023 నుంచి 27 మధ్య జరిగే ప్రతి మ్యాచుకూ రూ.7.09 కోట్లు ఇస్తోంది.