(Source: ECI/ABP News/ABP Majha)
Aditi Ashok, Golf Olympics: యావత్ భారతావనిని కదిలించిన అదితి అశోక్.. స్ఫూర్తిని రగిలించిన యువ సంచలనం
అందరికీ భిన్నంగా గోల్ఫ్ ఆటను కెరీర్‌గా ఎంచుకుంది. మద్దతు అంతగా ఉండని క్రీడ అయినా ప్రపంచ వేదికపై తన సత్తా చాటుతోంది భారత గోల్ఫర్ అదితి అశోక్. టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకుంది.
ఆటల్లో రిచ్చెస్ట్ గేమ్‌గా పేరున్న గోల్ఫ్‌పై ఒక్కసారిగా భారత్‌లో చర్చ మొదలైంది. అందుకు కారణం ఓ 23 ఏళ్ల యువతి. టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంటుందా అనే రీతిలో ప్రదర్శన చేసినా.. చివరి క్షణాల్లో దురదృష్టం ఆమెను వెంటాడింది. ఆమె మరెవరో కాదు కర్ణాటకకు చెందిన యువ సంచలనం, గోల్ఫర్ అదితి అశోక్. టోక్యో ఒలింపిక్స్‌లో చివరి క్షణాల్లో కాలం కలిసి రాకపోవడంతో పతకం చేజారింది. యావత్ భారతావని ఆమెకు మద్దతుగా నిలిచింది. శెభాష్ అదితి నీ పోరాటం మాకు స్ఫూర్తి అంటోంది.
5 ఏళ్లకే గోల్ఫ్‌పై ఆసక్తి..
1998 మార్చి 29న కర్ణాటక రాజధాని బెంగళూరులో జన్మించింది అదితి అశోక్. తండ్రి అశోక్, తల్లి మహేశ్వరి. మన దేశంలో చిన్నారులు బ్యాట్, బాల్ పట్టుకుని సరదాగా క్రికెట్ ఆడుతూనో, లేక కబడ్డీ లాంటి ఆటలు ఆడుతూ కనిపిస్తారు. కానీ అదితికి మాత్రం 5 ఏళ్ల వయసులో.. సంపన్నులు ఆడే క్రీడగా పేరుగాంచిన గోల్ఫ్ క్రీడపై ఆసక్తి ఏర్పడింది. కర్ణాటక గోల్ఫ్ అసోసియేషన్ డ్రైవింగ్ రేంజ్‌కు తీసుకెళ్లాలని కోరగా, తండ్రి అశోక్ ఆమెను ప్రోత్సహించారు. ఇక అది మొదలుకుని ఆమె గోల్ఫ్ క్రీడపై శ్రద్ధ వహిస్తూ, కఠోరంగా శ్రమించింది. 12 ఏళ్ల వయసులో ఆసియా పసిఫిక్ టోర్నమెంట్‌లో పాల్గొని మెరుగైన ప్రదర్శన చేసింది. కనీసం 18 ఏళ్ల వయసు వారు పాల్గొనాల్సిన ఆ టోర్నీలో పాల్గొనడంతో ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపైంది.
Also Read: Neeraj Chopra Wins Gold: నీరజ్ చోప్రాకు స్వర్ణం... వందేళ్ల భారత నిరీక్షణకు తెర... అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్
హ్యాట్రిక్ ఛాంపియన్..
మూడు సార్లు జాతీయ జూనియర్ ఛాంపియన్‌షిప్‌గా అవతరించింది అదితి అశోక్. 13 ఏళ్ల వయసులో ప్రొఫెసనల్ గోల్ఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 2013లో జరిగిన ఏషియన్ యూత్ గేమ్స్, 2014లో జరిగిన యూత్ ఒలింపిక్స్, ఏషియా గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించిన ఏకైన భారతీయ గోల్ఫర్‌గా నిలిచింది. 2011, 2014లలో రెండుసార్లు నేషనల్ అమెచ్యూర్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నాక అంతర్జాతీయ స్థాయి టోర్నీల దిశగా అడుగులు పడ్డాయి.
అతిపిన్న వయసులో ఒలిపిక్స్‌లో పాల్గొన్న గోల్ఫ్ క్రీడాకారిణిగా నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించిన గోల్ఫర్ అదితి.. 41వ స్థానానికి పరిమితమైంది. మరుసటి ఒలింపిక్స్‌లో కచ్చితంగా టైటిల్ సాధిస్తాననే నమ్మకం ఆమెలో కలిగినా.. ఆ కోరిక టోక్యోలో తీరలేదు. రియో ఒలింపిక్స్‌లో ఆమెకు క్యాడీగా (గోల్ఫ్ బ్యాగులు, క్లబ్స్ మోస్తూ సాయం చేసే వ్యక్తి) తండ్రి అశోక్ వెళ్లగా తాజాగా జరుగుతున్న టోక్యో ఒలిపిక్స్‌లో తల్లి క్యాడీగా వ్యవహరించారు. అదితి అశోక్ వెన్నంటే ఉండి ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపారు తల్లి మహేశ్వరి.
అంచనాలకు మించి రాణించినా..
2017 నవంబర్ నెలలో ఈ కర్ణాటక గోల్ఫర్ చరిత్ర సృష్టించింది. గుర్గావ్‌లోని డీఎల్ఎఫ్, కంట్రీ క్లబ్‌లో జరిగిన గోల్ఫ్ పోటీలో విదేశీయులతో పోటీ పడి మరీ ఉమెన్స్ ఇండియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. మహిళల గోల్ఫ్‌లో ఆమె ర్యాంక్ 200 అయినప్పటికీ ఒలింపిక్ పతకం సాధిస్తాననే విశ్వాసంతో బరిలోకి దిగింది. టోక్యో ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి రాణించి యావత్ భారతావని దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ నెంబర్ వన్, టాప్ టెన్ క్రీడాకారిణులకు తన ప్రదర్శనతో చెమటలు పట్టించింది. గోల్ఫ్ ఆటతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది అదితి.- మహిళల గోల్ఫ్ వ్యక్తిగత స్ట్రోక్ ప్లే ఈవెంట్‌లో తొలి మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి పతకం సాధించే స్థానంలో నిలిచినా, వాతావరణం అనుకూలించకపోవడంతో.. ఆపై ఆమె స్ట్రోక్స్ ఎక్కువ తీసుకోవడం.. తద్వారా ఒక్క స్ట్రోక్ తేడాతో నాలుగో స్థానానికి పరిమితమై పతకం కోల్పోయింది.
అమెరికా అథ్లెట్ నెల్లీ కొర్డా 167 స్ట్రోక్స్‌లో లక్ష్యాన్ని పూర్తి చేయగా, లిడియా, ఇనామి అనే మరో ఇద్దరు క్రీడాకారిణులు నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి 168 స్ట్రోక్స్‌తో కంప్లీట్ చేయగా.. భారత గోల్ఫర్ అదితి అశోక్ 169 స్ట్రోక్‌లతో నాలుగో స్థానానికి పరిమితమై పతకం కోల్పోయింది. లిడియా, ఇనామి మధ్య టై కాగా, వీరికి ఇచ్చిన టార్గెట్ మెరుగ్గా పూర్తి చేసిన జపాన్ అమ్మాయి రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ నెంబర్ వన్, అమెరికా అథ్లెట్ నెల్లీ కొర్డా స్వర్ణం సాధించగా, జపాన్‌కు చెందిన ఇనామి రజతం, న్యూజిలాండ్‌కు చెందిన లిడియా కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.