T20 World Cup: కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్ బై? రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్... T20 ప్రపంచకప్ తర్వాత కోచింగ్ జట్టులో భారీ మార్పులు?
భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి తన పదవికి త్వరలోనే గుడ్ బై చెబుతున్నాడా? అంటే అవుననే వార్తలే ఎక్కువగా వస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి తన పదవికి త్వరలోనే గుడ్ బై చెబుతున్నాడా? అంటే అవుననే వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. కోచ్ రవిశాస్త్రి మాత్రమే కాదు మొత్తం కోచింగ్ సిబ్బందే మారబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో ఊహించని మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.
టీమిండియా కోచ్ పదవికి గుడ్ బై గురించి ఇప్పటికే బీసీసీఐ(BCCI)కి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కోచ్ పదవికి వయో పరిమితి 60ఏళ్లు. రవిశాస్త్రికి ఇప్పటికే 59 ఏళ్లు. దీంతో అతడు ICC T20 ప్రపంచకప్ ముగియగానే తన పదవికి వీడ్కోలు పలికే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తమ బాధ్యతల నుంచి తపుకోనున్నారట. వీళ్ల పదవీకాలం కూడా T20 ప్రపంచకప్‌తోనే ముగియనుంది. మరోవైపు మిగతా కోచ్‌లు ఇప్పటికే IPL టీమ్స్‌తో ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా చెప్పుకోదగిన విజయాలే సాధించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రిని కోచ్‌గా కొనసాగిస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. కానీ, బీసీసీఐ మాత్రం మొత్తం కోచింగ్ జట్టును మార్చాలనే భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. 2014లో టీమ్ డైరెక్టర్‌గా తొలిసారి బాధ్యతలు స్వీకరించాడు రవిశాస్త్రి. ఆ తర్వాత అనిల్ కుంబ్లే టీమిండియాకు కోచ్‌గా వచ్చిన సమయంలో అతడు టీమ్‌కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత 2017లో అనిల్ కుంబ్లే కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగానే రవిశాస్త్రి ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో కోహ్లీ సేన స్వదేశంతో పాటు విదేశీ పర్యటనల్లోనూ మంచి విజయాలు సాధించింది. ఐసీసీ టోర్నీ గెలవలేదన్న నిరాశ తప్ప.. కోచ్‌గా రవిశాస్త్రి మంచి సక్సెసే సాధించారని చెప్పవచ్చు.
రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్?
ద్రవిడ్ అండర్-19, భారత్-ఏ కోచ్‌గా విజయవంతం అయ్యాడు. రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ రేసులో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడే ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటికే అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా, ఇండియా ఎ, అండర్ - 19 టీమ్ కోచ్‌గా విజయవంతం అయ్యాడు. ఈ మధ్య శ్రీలంక వెళ్లిన శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియాకు ద్రవిడే కోచ్‌గా వ్యవహరించాడు. ఈ పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్‌ని గెలుచుకోగా, T20 సిరీస్‌ను చేజార్చుకుంది. ఒకవేళ రవిశాస్త్రి తప్పుకుంటే ఆ పదవిని ద్రవిడ్‌కే ఇవ్వాలని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు సలహా ఇచ్చారు.