PV Sindhu: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు... విశాఖలో త్వరలో అకాడమీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పీవీ సింధు కలిశారు. ఒలింపిక్స్ కాంస్యం పతకాన్ని సింధు సీఎం జగన్ కు చూపించారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం జగన్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు ఇవాళ కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధును సీఎం జగన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం సత్కరించారు. దేశానికి పతకాన్ని సాధించేందుకు దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం అభినందించారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీని త్వరలో ప్రారంభించాలని సింధును కోరారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.30 లక్షల పారితోషకాన్ని అధికారులు... సింధుకు అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పీవీ సింధు సీఎం వైఎస్ జగన్‌ను కలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సీఎం జగన్ ఆశీర్వదించారని, ఒలింపిక్స్‌లో మెడల్ తీసుకురావాలని కోరారన్నారు. ఏపీ ప్రభుత్వం క్రీడలను బాగా ప్రోత్సహిస్తోందని ఆమె చెప్పారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌కు 2 శాతం రిజర్వేషన్ ఇవ్వడం గొప్ప విషయం ఆమె చెప్పారు. నేషనల్స్‌లో గెలిచిన వారికి వైఎస్సార్ పురస్కార అవార్డులు ఇస్తున్నారని గుర్తుచేశారు. తన బ్యాడ్మింటన్ అకాడమీకి విశాఖలో ప్రభుత్వం స్థలం కేటాయించిందని సింధు అన్నారు. త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని పీవీ సింధు పేర్కొన్నారు.
ఒలింపిక్స్‌లో మెడల్ గెలుచుకోవడం చాలా గర్వంగా ఉందని సింధు తెలిపారు. కాంస్య పతకం పోరులో గెలిచిన తర్వాత రెండు నిమిషాలు నిశ్చేష్టమయ్యానని పీవీ సింధు పేర్కొన్నారు. సెకండ్ టైమ్ ఒలంపిక్ మెడల్ దేశానికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీలోనే తాను ఉద్యోగం చేస్తున్నానని, ఇంత అభిమానం చూపిన వారందరికి ఒలింపిక్ పతకాన్ని అంకితమిస్తున్నట్లు స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొన్నారు.
అంతకు ముందు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు సింధుకు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు దుర్గమ్మను దర్శించుకున్నానని పీవీ సింధు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో పతకం సాధించానన్నారు. దుర్గమ్మ దర్శనానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. 2024 ఒలింపిక్స్ సహా భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాలని అమ్మవారిని కోరుకున్నానని సింధు అన్నారు. రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు రజత పతకాన్ని సాధించిన విషయం అందరికీ విధితమే.
Also Read: Anasuya Bharadwaj Photos Leaked: 'పుష్ప'లో అనసూయ.. బాయ్‌కట్ లుక్ తో షాకిచ్చింది..
Also Read: PV Sindhu: విజయవాడ దుర్గమ్మ సేవలో పీవీ సింధు