Olympic swimmer dismissed from 2024 Games : విశ్వ క్రీడల్లో పాల్గొనడమే చాలామంది క్రీడాకారులు తమకు దక్కిన అదృష్టంగా భావిస్తారు. ఆ బెర్తును సాధించేందుకు ఏళ్లకు ఏళ్లు కఠోర శ్రమ చేస్తారు. ఆ ఒలింపిక్ బెర్తు సాధించిన తర్వాత పతక కల దిశగా సాగుతారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ముమ్మరంగా సాధన చేస్తుంటారు. ప్రతీ దేశం కూడా ఈ విశ్వ క్రీడలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఇందులో ఒక్క పతకం సాధించినా ఆ దేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. కాబట్టి విశ్వ క్రీడల్లో ఒక పతకమైన దక్కాలని అన్ని దేశాలు తపిస్తుంటాయి. అందుకే అందులో ఏ చిన్న తప్పు జరిగినా సహించవు. ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. విశ్వ క్రీడలకు వచ్చి భాయ్‌ఫ్రెండ్‌తో షికారుకు వెళ్లిన అథ్లెట్‌ను ఒలింపిక్స్ నుంచి బయటకు పంపేశారు. విశ్వ క్రీడలు జరుగుతున్నప్పుడు ఈ తిరుగుళ్లు ఏంటంటూ బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ అ స్విమ్మర్‌ను ఇంటికి వచ్చేయమని ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఆమె చేసిన తప్పు ఇన్నేళ్లు పడ్డ శ్రమను వృథా చేసేశాయి.
ఏం జరిగిందంటే...
కరోలినా వియెరా(Carolina Vieira) బ్రెజిల్(Brazilian)కు చెందిన స్టార్ స్విమ్మర్. విశ్వ క్రీడల్లో బ్రెజిల్ ఈ స్టార్ స్విమ్మర్ పతకం సాధిస్తుందని భారీగా అంచనాలు పెట్టుకుంది. కరోలినా వియెరా-ఆమె ప్రియుడు శాంటోస్ కూడా ఒలింపిక్స్(Paris Olympics) స్విమ్మింగ్‌లో బ్రెజిల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో 22 ఏళ్ల కరోలినా పాల్గొంది. పురుషుల 4×100 ఫ్రీస్టైల్ హీట్స్‌లో 28 ఏళ్ల శాంటోస్ ఓడిపోయాడు. వీరిద్దరు ఒలింపిక్ విలేజ్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
ఏమిటీ తిరుగుళ్లు
ప్రాక్టీస్‌ను పక్కనపెట్టిన కరోలినా-శాంటోస్ పారిస్‌ను చుట్టేశారు. జులై 26న వీరిద్దరూ కలిసి ఈఫిల్ టవర్‌ని చూడటానికి వెళ్లారు. ఇలా ఒలింపిక్ గ్రామాన్ని వీడి బయటకు వెళ్లాలంటే ఆమె బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రియుడితో కరోలినా పారిస్‌లో టూర్ వేసేసింది.
అంతటితో ఆగకుండా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కరోలినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలతో వారిద్దరూ కలిసి బయటకు వెళ్లినట్లు బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ తెలుసుకుంది. అనుమతి తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండా ఇద్దరు కలిసి బయట తిరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒలింపిక్ క్రీడల గ్రామాన్ని వదిలి వెంటనే స్వదేశానికి రావాలని కరోలినాను ఆదేశించింది. శాంటోస్ క్షమాపణలు అడగడంతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఊహించని విధంగా ఎంతో అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్న కరోలినా కన్నీళ్లు పెట్టుకుంటూ ఒలింపిక్ విలేజ్‌ను వీడినట్లు సహచర అథ్లెట్లు తెలిపారు. ఎంతో కష్టపడి ఒలింపిక్స్ విలేజ్‌కు వచ్చింది ఎంజాయ్ చేసేందుకు కాదని బ్రెజిల్ స్విమ్మింగ్ కమిటీ హెడ్ గుత్సావో ఒట్‌సుకా తేల్చి చెప్పారు. కరోలినా నిబంధనలు పాటించలేదని... అందుకే కఠినమైన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.