Leicester Cricket Ground: ఇంగ్లాండ్‌లో స్టేడియానికి గావస్కర్ పేరు! ఇంతకు మించిన గౌరవం ఏముంటుంది!!
Sunil Gavaskar: సునిల్ గావస్కర్ అరుదైన గౌరవం అందుకోబోతున్నారు! ఇంగ్లాండ్‌లోని ఓ క్రికెట్ స్టేడియానికి ఆయన పేరు పెడుతున్నారని తెలిసింది.

Leicester Cricket Ground: టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అరుదైన గౌరవం అందుకోబోతున్నారు! ఇంగ్లాండ్‌లోని ఓ క్రికెట్ స్టేడియానికి ఆయన పేరు పెడుతున్నారని తెలిసింది. లీసెస్టర్ షైర్‌లోని ఓ స్టేడియానికి ఆయన పేరు పెట్టేందుకు రంగం సిద్ధమైందని సమాచారం.
దేశం గర్వించదగ్గ క్రికెటర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar)! 1970, 80ల్లో ఆయన భారత క్రికెట్‌కు ముఖచిత్రంగా మారారు. భీకరమైన జట్లపై విధ్వంసకరంగా ఆడేవారు. హెల్మెట్ పెట్టుకోకుండానే ఆనాటి భయానక పేసర్లను ఎదుర్కొన్నారు. విండీస్ పేస్ చతుష్టయం మైకెల్ హోల్డింగ్స్, ఆండీ రాబర్ట్స్, మాల్కమ్ మార్షల్, జోయెల్ గార్నర్ బౌలింగ్‌ను చితకబాదారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పేసర్లనూ ఓ ఆటాడుకున్నారు. ప్రపంచ క్రికెట్లోనే టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
లీసెస్టర్ షైర్‌లో మైదానానికి (Leicester Cricket Ground) తన పేరు పెట్టడం సంతోషంగా ఉందని గావస్కర్ అంటున్నారు. 'లీసెస్టర్‌లోని స్టేడియానికి నా పేరు పెడుతున్నందుకు సంతోషం. ఇది నాకెంతో గౌరవం. లీసెస్టర్‌లో క్రికెట్‌ను ప్రేమించేవారు ఎక్కువగా ఉంటారు. ప్రత్యేకించి భారత క్రికెట్‌ను ఇష్టపడుతారు. అందుకే నాకిదో గౌరవం' అని గావస్కర్ అన్నారు.
Also Read: సంజు సూపర్ మ్యాన్ ఫీట్! టీమ్‌ఇండియాను గెలిపించిన డైవ్!
స్టేడియానికి గావస్కర్ పేరు పెట్టేందుకు భారత సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారని తెలిసింది. మూడు దశాబ్దాలుగా వారు లీసెస్టర్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్టేడియంలోని ఓ పెవిలియన్ గోడలపై సన్నీ భారీ చిత్రాన్ని చిత్రీకరించారట. భారత్ స్పోర్ట్స్, క్రికెట్ క్లబ్ ఈ పెవిలియన్‌ను సొంతం చేసుకుంది.
సునిల్ గావస్కర్ అంతర్జాతీయ క్రికెట్లో 13,214 పరుగులు చేశారు. 1971-1987 మధ్య 35 సెంచరీలు చేశారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో పదివేల టెస్టు పరుగులు చేసిన తొలి క్రికెటర్ ఆయనే కావడం ప్రత్యేకం. 1987, మార్చి 7న అహ్మదాబాద్‌లో పాక్‌పై ఆయన ఈ ఘనత అందుకున్నారు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఆయన సభ్యుడు. ఆటకు వీడ్కోలు పలికాక బీసీసీఐ పాలకుడు, కోచ్, బ్రాడ్‌కాస్టర్, కామెంటేటర్‌గా అలరించారు. పుస్తకాలూ రాశారు.
Also Read: టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన విండీస్ - మూడు పరుగులతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
Also Read: టీమిండియా కోసం మూడున్నర కోట్లతో మాంచెస్టర్ నుంచి ట్రినిడాడ్‌కు స్పెషల్ ఫ్లైట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

