IND vs WI 1st ODI Highlights: టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన విండీస్ - మూడు పరుగులతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
IND vs WI 1st ODI 1st Innings Highlights: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా మూడు పరుగులతో విజయం సాధించింది.
![IND vs WI 1st ODI Highlights: టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన విండీస్ - మూడు పరుగులతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ! IND vs WI 1st ODI Match Highlights India Won By 3 Runs Against West Indies IND vs WI 1st ODI Highlights: టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన విండీస్ - మూడు పరుగులతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/9d6627bb20b8417bfe16ee32d5657ab41658528849_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వెస్టిండీస్‌తో థ్రిల్లింగ్‌గా సాగిన మొదటి వన్డేలో టీమిండియా మూడు పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 305 పరుగులకే పరిమితం అయింది. దీంతో మూడు వన్డేల ఈ సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది.
చెలరేగిన శిఖర్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (64: 53 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), శిఖర్ ధావన్ (97: 99 బంతుల్లో, 10 ఫోర్లు, మూడు సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 17.4 ఓవర్లలోనే 119 పరుగులు జోడించారు. అనంతరం లేని పరుగుకు ప్రయత్నించి గిల్ అవుట్ కావడంతో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది.
అయితే ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (54: 57 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), ధావన్ మరో భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరు రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. దీంతో భారత్ 213 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ రాణించకపోవడంతో టీమిండియా త్వరగా వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు కూడా వేగంగా చేయలేకపోయింది. దీంతో 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితం అయింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ రెండేసి వికెట్లు తీయగా, రొమారియో షెపర్డ్, అకెల్ హుస్సేన్ చెరో వికెట్ పడగొట్టారు.
చివరి బంతి వరకు పోరాడిన వెస్టిండీస్
309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే ఓపెనర్ షాయ్ హోప్‌ను (7: 18 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేసిన సిరాజ్ భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. అప్పటికి వెస్టిండీస్ స్కోరు 16 పరుగులు మాత్రమే. ఆ తర్వాత మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (75: 68 బంతుల్లో, 10 ఫోర్లు, ఒక సిక్సర్), షామర్హ్ బ్రూక్స్ (46: 61 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 117 పరుగులు జోడించారు.
కైల్ మేయర్స్ వేగంగా ఆడగా, బ్రూక్స్ తనకు చక్కటి సహకారం అందించాడు. వీరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో శార్దూల్ ఠాకూర్ విండీస్‌ను దెబ్బ తీశాడు. తన వరుస ఓవర్లలో కైల్ మేయర్స్, బ్రూక్స్ ఇద్దరినీ అవుట్ చేశాడు. వీళ్లు అవుటయ్యాక బ్రాండన్ కింగ్ (54: 66 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), నికోలస్ పూరన్ (25: 26 బంతుల్లో, రెండు సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. కీలక దశలో పూరన్ అవుట్ కావడం, రొవ్‌మన్ పావెల్ (6: 7 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం కావడం వెస్టిండీస్ విజయావకాశాలను దెబ్బ తీశాయి.
చివర్లో అకియల్ హొస్సేన్ (32: 32 బంతుల్లో, రెండు ఫోర్లు), రొమారియో షెపర్డ్ (39: 25 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి బంతికి ఐదు పరుగులు సాధించాల్సిన దశలో రొమారియో షెపర్డ్ ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. దీంతో టీమిండియా మూడు పరుగులతో విజయం సాధించింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)