MS Dhoni In ICC Hall Of Fame: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటుపై ధోని స్పందన ఇదే
MS Dhoni In ICC Hall Of Fame: క్రికెట్ కు అద్బుతమైన సేవ చేసినందుకుగాను మేటీ ఆటగాళ్లను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేరుస్తారు. ఈ ఘనత భారత దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీని వరించింది.

MS Dhoni Greatest Captain:
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేరాడు, ఇది అతని అద్భుతమైన క్రికెట్ కెరీర్‌లో మరో అద్భుతమైన అధ్యాయాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం ఈ హోదా అందుకున్న ఏడుగురు క్రికెటర్లలో ఎంఎస్ ధోని కూడా ఉన్నారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. వీరిలో మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా), హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) వంటి గొప్పవారు ఉన్నారు. ఈ గౌరవం అందుకున్న తర్వాత ధోని ఎలా స్పందించాడో చూద్దాం.
ధోని ఏమి అన్నారు
ఈ గౌరవం అందుకున్న తర్వాత ఎంఎస్ ధోని మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ తరాల క్రికెటర్ల సహకారాన్ని గుర్తించే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో నా పేరు రావడం గౌరవంగా ఉంది. అలాంటి ఆల్ టైమ్ గ్రేట్స్‌తోపాటు నా పేరును చూడటం అద్భుతమైన అనుభూతి. "
ICC HALL OF FAME 2025:
— The Sports Feed (@thesports_feed) June 9, 2025
1) MS Dhoni
2) Matthew Hayden
3) Hashim Amla
4) Greame Smith
5) Daniel Vettori
6) Sana Mir
7) Sarah Taylor#icchalloffame #MSDhoni #ICCHallOfFame #MSDhoni𓃵 #BCCI #WWDC25 #WWDC2025 pic.twitter.com/aXhoKVEKsl
ఐసీసీ ప్రకటనలో ఏమి చెప్పింది
ఒత్తిడిలో ధోని సహనం, సాటిలేని నైపుణ్యాలతోపాటు, చిన్న ఫార్మాట్లలో అతని మార్గదర్శక నైపుణ్యాలతో, ఎంఎస్ ధోని ఆటలో గొప్ప ఫినిషర్లు, నాయకులు, వికెట్ కీపర్లలో ఒకరిగా పేరు పొందారని చెప్పుకొచ్చింది. అటువంటి పరిస్థితిలో, ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చడం ద్వారా అతన్ని గౌరవించింది.
"భారతదేశం తరపున ధోని 17,266 అంతర్జాతీయ పరుగులు, 829 వికెట్లు(వికెట్ల వెనకాల), వివిధ ఫార్మాట్లలో 538 మ్యాచ్‌ల గణాంకాలు అతని ప్రతిభను మాత్రమే కాకుండా అసాధారణమైన స్థిరత్వం, ఫిట్‌నెస్‌ను ప్రతిబింబిస్తాయి" అని ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది.
సంధి దశలో అద్భుత పాత్ర..
భారత క్రికెట్ సంధి దశలో ఉన్నప్పుడు అద్భుతమైన కెప్టెన్ గా రాణించడాని ఐసీసీ కొనియాడింది. ముఖ్యంగా 2004లో అరంగేట్రం చేసిన ధోనీ.. తన రాకను ప్రపంచానికి చాటాడు. ఆ తర్వాత 2007 వన్డే ప్రపంచకప్ లీగ్ దశలో భారత్ ఇంటిముఖం పట్టడంతో తీవ్రమైన నిరాశ స్థితిలో ఉన్నప్పుడు ధోనీ టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. తొలిసారిగా నిర్వహించిన ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో టైటిల్ ను భారత్ నెగ్గింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఉత్కంఠభరిత విజయం సాధించింది. దీంతో కెప్టెన్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా మరిన్ని శిఖరాలు అధిరోహించడంలో కీలక పాత్ర పోషించాడు.
28 ఏళ్ల తర్వాత..
1983లో వన్డే ప్రపంచకప్ గెలిచాక, మళ్లీ 28 ఏళ్ల తర్వాత టీమిండియా ఆ ట్రోఫీని ధోనీ సారథ్యంలోనే గెలుచుకుంది. ఆ తర్వాత రెండేళ్లకు 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ధోనీ సారథ్యంలో ఎంతోమంది మెరికల్లాంటి క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. రోహిత్ శర్మ, ఆర్పీ సింగ్, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తీక్ లాంటి వాళ్లు సత్తా చాటారు. ఇక 2019లో అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు ప్రకటించాక, ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఇక తనకు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కడంపై ధోనీ ఆనందం వ్యక్తం చేశాడు. తరతరాలుగా మేటి ఆటగాళ్లను ఈ జాబితాలో చోటు దక్కించుకుంటున్నారని, తన పేరు కూడా ఈ లిస్టులో ఉండటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.




















