IPL 2024: ధోనీ చెలరేగగా , అభిమానులకు కన్నుల పండుగ
Ms Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం విశాఖలో దుమ్మురేపాడు. పాత ధోనీని తలపిస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు.
Ms Dhoni Entertains fans With Explosive Hitting: ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలో చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్ జట్టు విజయం సాధించింది. అయితేనేం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం విశాఖలో దుమ్మురేపాడు. పాత ధోనీని తలపిస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను వణికించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ( CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. వార్నర్ , పంత్, పృథ్వీ షాలు రాణించారు. ప్రమాదం తో ఆసుపత్రి పాలైన పంత్ 15 నెలల విరామం కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన సీఎస్కే జట్టు బ్యాటర్లు తడబడ్డారు. ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు. ఆ తరువాత రహానె పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 45 వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు క్రీజులోకి వస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ వచ్చారు. సీఎస్కే జట్టు బ్యాటర్లు ఒక్కొక్కరుగా అవుట్ అవుతున్న అభిమానులు బాధపడటం సంగతి పక్కన పెడితే ధోనీధోనీ అంటూ స్టేడియం అంతా మోత మోగించేశారు. వారు కోరుకున్నట్టుగానే చివరిలో బరిలో దిగిన ధోనీ సిక్సర్ల మోతమోగించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్‌లో ధోనీ కొట్టి సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అన్రిచ్ నోకియా వేసిన ఆఖరి ఓవర్‌లో అయితే 4, 6, 0, 4, 0, 6లతో 20 పరుగులు చేశాడు. శివమ్ దూబే ఔటైన అనంతరం 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తనదైన బ్యాటింగ్‌తో చెలరేగాడు.
గెలుపు ఢిల్లీకి - అభిమానం ధోనీకి
ఢిల్లీ ఫ్రాంచైజీ ఈ విశాఖ మైదానాన్ని హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకున్నా గ్రౌండ్ అంతా పసుపుమయం అయిపోయింది. మ్యాచ్ గెలుపు ఢిల్లీదే అయినా ధోనీ మానియాతో అభిమానులు ఊగిపోయారు. మహేంద్ర సింగ్ ధోని జోరు చూశాక.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండేవి. ఈ నేపథ్యంలో ధోనీ సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు అందుకుంటున్న ధోనీ ఫొటోను పోస్ట్ చేసిన సాక్షి మ్యాచ్‌ను ఓడిపోయామని ధోనీకి ఇంకా తెలియదంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఓటమి బాధ లేకుండా ధోనీ చక్కగా ఆనందంగా అవార్డు తీసుకోవడంతో సాక్షి ఇలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.
ఓటమి గురించి రుతురాజ్..
మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. పిచ్‌లో మార్పు తమకు స్పష్టంగా తెలిసిందన్నాడు. మొదట బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్..తమ ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి సీమ్ అయిందన్నాడు. 191 స్కోర్ ని చూసి తాము విజయం తధ్యం అనుకున్నామని, కానీ పవర్ ప్లేలో దారుణంగా విఫలమవ్వటంతో లక్ష్యచేధనలో వెనకబడ్డామన్నాడు. రెండు విజయాల తర్వాత వచ్చిన ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు.