IPL 2024: రాజస్థాన్‌పై లక్నో ప్రతీకారం తీర్చుకుంటుందా ?
LSG vs RR, IPL 2024 : ఐపీఎల్ 44వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు రాహుల్ సేన పోరాడుతుంటే, సంజూ టీం దూకుడు మీదుంది.
LSG vs RR IPL 2024 Preview And Prediction :ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్... నాలుగో స్థానంలో ఉన్న లక్నోతో అమీతుమీ తేల్చుకోనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై మరోసారి విజయం సాధించి అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎనిమిది మ్యాచులు ఆడిన రాజస్థాన్ ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. లక్నో కూడా ఎనిమిది మ్యాచులు ఆడి అయిదు మ్యాచుల్లో విజయం సాధించి మూడు పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది.
ఫేవరెట్ రాజస్థాన్
ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ భీకర ఫామ్‌లో ఉంది. వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్ ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసిరానుంది. పరాగ్ ఎనిమిది మ్యాచుల్లో 318 పరుగులతో రాజస్థాన్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ యశస్వి జైస్వాల్ మళ్లీ ఫామ్‌లోకి రావడంతో రాజస్థాన్ బ్యాటింగ్ మరింత బలోపేతమైంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జైస్వాల్ 60 బంతుల్లో అజేయంగా 104 పరుగులు చేసి రాజస్థాన్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. జోస్ బట్లర్ కూడా బ్యాటు ఝుళిపిస్తే లక్నో బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. కెప్టెన్ సంజూ శాంసన్ భారీ ఇన్నింగ్సులు ఆడకపోవడం రాజస్థాన్‌ను కలవరపెడుతోంది. హిట్‌మెయిర్ కూడా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. రోవ్‌మన్ పావెల్, ధ్రువ్ జురెల్ ఇంకా భారీ ఇన్నింగ్సులు ఆడలేదు. రాజస్థాన్ బౌలింగ్ విభాగం అనుభవజ్ఞులైన బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మలతో చాలా బలంగా ఉంది. సందీప్ శర్మ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులకు 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. రాజస్థాన్ స్పిన్ విభాగం కూడా యుజువేంద్ర చాహల్, అశ్విన్‌లతో బలంగా ఉంది. చాహల్ ఎనిమిది మ్యాచ్‌లలో 13 వికెట్లతో ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
లక్నో ప్రతీకారం తీర్చుకుంటుందా..?
రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. KL రాహుల్ జట్టు వరుసగా రెండు విజయాలు సాధించి ఆత్మ విశ్వాసంతో ఉంది. క్వింటన్ డి కాక్ మెరుపు బ్యాటింగ్ చేయాలని చూస్తున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ అజేయ శతకం చేసి ఫామ్‌లోకి రావడం లక్నోకు కలిసిరానుంది. చెన్నైతో మ్యాచ్‌లో స్టోయినిస్ 63 బంతుల్లో 124 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లక్నోకు ఆరు వికెట్ల విజయాన్ని అందించాడు. దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్, దీపక్ హుడాలతో లక్నో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. లక్నో పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌లో బరిలో దిగే అవకాశం ఉంది.
జట్లు
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కొహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కొటియన్, కేశవ్ మహరాజ్.
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరక్ మన్కడ్, అర్షద్ మన్కడ్, ఖాన్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, నవీన్-ఉల్-హక్, దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, మయాంక్ యాదవ్ మరియు అర్షిన్ కులకర్ణి.