KKR vs GT: చివర్లో చెలరేగిన కోల్‌కతా బౌలర్లు - ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన రసెల్ - గుజరాత్ ఎంతకు పరిమితం అయిందంటే?
KKR vs GT, IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (67: 49 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరి ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన రసెల్ గుజరాత్‌ను కీలక సమయంలో కట్టడి చేశాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు కోరుకున్న ప్రారంభం లభించలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7: 5 బంతుల్లో) ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా, మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (25: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) రెండో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించిన సాహాను 11వ ఓవర్లో ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు.
దీంతో పాండ్యాకు డేవిడ్ మిల్లర్ (27: 20 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) జతకలిశాడు. వీరిద్దరూ వేగంగా ఆడారు. హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీ కూడా పూర్తయింది. అయితే ఇన్నింగ్స్ కీలక దశలో ఇద్దరూ వరుస ఓవర్లలో అవుట్ కావడం గుజరాత్ భారీ స్కోరు అవకాశాలను దెబ్బ తీసింది. గత మ్యాచ్‌లో విశేషంగా రాణించిన రషీద్ ఖాన్ (0: 2 బంతుల్లో) కూడా విఫలం అయ్యాడు.
చివరి ఓవర్లలో వేగంగా ఆడే రాహుల్ తెవాటియా (17: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) మ్యాజిక్ కూడా ఈసారి పనిచేయలేదు. ఆఖరి ఓవర్లో ఆండ్రీ రసెల్ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
కోల్‌కతా బౌలర్లలో రసెల్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. టిమ్ సౌతీ మూడు వికెట్లు తీయగా... ఉమేష్ యాదవ్, శివం మావి చెరో వికెట్ పడగొట్టారు. రసెల్ పడగొట్టిన నాలుగు వికెట్లు ఒకే ఓవర్లో రావడం విశేషం. గుజరాత్ టైటాన్స్ చివరి ఐదు ఓవర్లలో 29 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయారు.
View this post on Instagram