David Warner: ఉప్పల్.. డేవిడ్ భాయ్ డెన్! ఇక్కడే 3 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు!
David Warner: హైదరాబాద్‌కు డేవిడ్ భాయ్ అంటే.. డేవిడ్ భాయ్‌కు హైదరాబాద్ అంటే ప్రాణం! ఉప్పల్ కు అతడు తిరుగులేని రారాజుగా అవతరించాడు. అతడి రికార్డులు ఇదే మాట చెబుతున్నాయి.
David Warner IPL 2023:
హైదరాబాద్‌కు డేవిడ్ భాయ్ అంటే.. డేవిడ్ భాయ్‌కు హైదరాబాద్ అంటే ప్రాణం! ఒక రకంగా అతనంటే తెలుగువాళ్లకు విపరీతమైన అభిమానం! ఐపీఎల్ వచ్చిందంటే అతడు మన ఇంటి నుంచి వెళ్లిన క్రికెటర్‌గా భావిస్తుంటాం. తెలుగువాళ్లే ఉండని జట్టులో తెలుగువాడిగా అనుకుంటాం. అందుకు తగ్గట్టే అతడు పొట్టి క్రికెట్లో మెరుపులు మెరిపించాడు. ఉప్పల్ మైదానాన్ని దుర్బేధ్యమైన కోటగా మార్చుకున్నాడు. దానికి తిరుగులేని రారాజుగా అవతరించాడు. అతడి రికార్డులు ఇదే మాట చెబుతున్నాయి.
A love story scripted in Hyderabad 🥹
— Delhi Capitals (@DelhiCapitals) April 23, 2023
📹| Our skipper on his special bond with the city and the fans 🫶#YehHaiNayiDilli #IPL2023 #SRHvDC | @davidwarner31 pic.twitter.com/tFdXe8Whp6
కంచుకోట
ఉప్పల్ మైదానంలో డేవిడ్ వార్నర్‌కు తిరుగులేదు. ఐపీఎల్ కెరీర్లో అత్యంత ఎక్కువ పరుగులు సాధించింది ఇక్కడే. సెంచరీలు, హాఫ్ సెంచరీలూ, బౌండరీలు, సిక్సర్లు బాదేసింది ఇక్కడే! అందుకే ఉప్పల్ అంటే అతడికో ప్రత్యేకమైన అభిమానం. ఆస్ట్రేలియా తర్వాత తన రెండో ఇంటిగా భావిస్తుంటాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్లో 31 మ్యాచులు ఆడిన బాహుబలి అలియాస్ మన డేవిడ్ భాయ్.. 66.75 సగటు, 161.65 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 1602 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు కొట్టేశాడు. ఇక్కడ తన జట్టు చేసిన మొత్తం పరుగుల్లో అతడి వాటా 32.57 శాతమంటే నమ్మశక్యం కాదు. ఇదే మైదానంలో 11 క్యాచులూ అందుకున్నాడు.
సెంచరీలు స్పెషల్
డేవిడ్ వార్నర్‌కు ఉప్పల్ మైదానంతో తొలిసారి అనుబంధం ఏర్పడింది 2012 మే 10న. దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున బరిలోకి దిగి సెంచరీ కొట్టాడు. దక్కన్ ఛార్జర్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చి 54 బంతుల్లోనే 109తో అజేయంగా నిలిచాడు. 10 బౌండరీలు, 7 సిక్సర్లు కొట్టాడు. దిల్లీకి విజయం అందించాడు. 2017, ఏప్రిల్ 30న వార్నర్ ఇక్కడ రెండో సెంచరీ బాదేశాడు. సన్‌రైజర్స్ తరఫున మొదట బ్యాటింగ్‌కు దిగి 59 బంతుల్లోనే 10 బౌండరీలు, 8 సిక్సర్ల సాయంతో 126 బాదేశాడు. 2019, మార్చి 31న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అతడి ప్రదర్శనను మర్చిపోలేం. జానీ బెయిర్ స్టో (114), డేవిడ్ వార్నర్ (100) కలిసి తొలి వికెట్‌కు 185 పరుగుల భాగస్వామ్యం అందించారు. వార్నర్ 55 బంతుల్లో సెంచరీ సాధించాడు. 5 సిక్సర్లు, 5 బౌండరీలు బాదేశాడు. ఇక హాఫ్ సెంచరీలు, 70+, 90+ స్కోర్లు చాలా ఉన్నాయి.
మూడేళ్లకు ఉప్పల్‌లో..
విభేదాలు.. అభిప్రాయ బేధాలతో డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసినా తెలుగువాళ్లు మాత్రం వదల్లేకపోతున్నారు. అతడు ఎక్కడ.. ఏ జట్టుకు ఆడినా చూస్తుంటారు. అతడు సెంచరీలు.. హాఫ్ సెంచరీలు బాదేస్తుంటే ఆనంద పడతారు. కరోనాతో మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచులు జరగలేదు. అతను వెళ్లాక తొలిసారి ఉప్పల్‌లో ఆడుతుండటంతో ఫ్యాన్స్ ప్రత్యేక భావోద్వేగంతో ఉన్నారు. మరి అతడు ఆరెంజ్ ఆర్మీపై ఎలా చెలరేగుతాడో చూడాలి.
A special 💌 from Skipper Davey to Hyderabad 👋
— Delhi Capitals (@DelhiCapitals) April 23, 2023
2️⃣4️⃣ hours to go for #SRHvDC!#YehHaiNayiDilli #IPL2023 @davidwarner31 pic.twitter.com/81kzDtd7wj