(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022 Red vs Black Soil: ఎర్రమట్టి వికెట్లపై గెలిపించేది పేసర్లా? స్పిన్నర్లా? ఏ జట్టుకు బెస్ట్!!
IPL 2022: ఐపీఎల్లో 70 మ్యాచుల్లో 55 ముంబయిలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ ఎర్ర మట్టి పిచ్‌లే కావడం గమనార్హం. మరి వికెట్‌పై బంతి ఎలా తిరుగుతుంది? పేస్‌కు అనుకూలిస్తాయా? స్పిన్‌కు ఓకేనా? ఛేదన చేస్తే గెలుపు సాధ్యమేనా?
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో మూడు రోజుల్లో మొదలవుతోంది. మొత్తం 70 మ్యాచుల్లో 55 మ్యాచులు ముంబయి నగరంలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ ఎర్ర మట్టి పిచ్‌లే కావడం గమనార్హం. ఇక పుణెలోని ఎంసీఏలో నల్లమట్టితో పిచ్‌ను రూపొందించారు. మరి వికెట్‌పై బంతి ఎలా తిరుగుతుంది? పేస్‌కు అనుకూలిస్తాయా? స్పిన్‌కు ఓకేనా? ఛేదన చేస్తే గెలుపు సాధ్యమేనా?
Wankhede Stadiumలో పేసర్లదే రాజ్యం
ముంబయిలోని వాంఖడే గురించి అందరికీ తెలుసు. ఇక్కడ ఆడిన చివరి 13 నైట్ గేముల్లో 10 విజయాలు ఛేదన జట్టుకే సొంతమయ్యాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 175గా ఉంది. రిస్ట్ స్పిన్నర్లకు ఈ పిచ్ కఠిన సవాళ్లు విసురుతోంది. ఓవర్‌కు 9.15 పరుగులు ఇచ్చేస్తున్నారు. 34 బంతులకు ఒక వికెట్ చొప్పున తీస్తున్నారు. ఫింగర్ స్పిన్నర్లు మాత్రం కాస్త ఓకే. ఓవర్‌కు 6.92 పరుగులు ఇస్తుండగా 27 బాల్స్‌కు వికెట్ తీస్తున్నారు. పేసర్లకు మాత్రం ఇది స్వర్గధామమే! వేగంగా, స్వింగ్ చేసే పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటారు. ఐపీఎల్ 2021లో స్పిన్నర్లు ఒక వికెట్ తీస్తే పేసర్లు 31 వికెట్లు తీయడం గమనార్హం. మొత్తంగా గత సీజన్లో వీరు 27.52 సగటు, 8.98 ఎకానమీ, 18.3 స్ట్రైక్‌రేట్‌తో 153 వికెట్లు తీశారు. ఛేజింగ్ చేసిన జట్టు దాదాపుగా గెలవడం ఖాయం.
Brabourne stadiumలో పవర్‌ప్లే కీలకం
బ్రబౌర్న్ స్టేడియంలో 2015 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ జరగలేదు. అయితే ఆఖరి తొమ్మిది మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఆరు సార్లు గెలిచాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 173. ఈ పిచ్ కూడా పేసర్లకు అనుకూలిస్తుంది. 2019 ఐపీఎల్ నుంచి చూసుకుంటే పవర్‌ప్లేలో పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటారు. ఇక్కడ పేసర్లు 33 సగటుతో 44 వికెట్లు తీస్తే స్పిన్నర్లు 1 వికెట్ తీశారు. ఇన్నాళ్లూ ఇక్కడ మ్యాచులు జరగలేదు కాబట్టి మున్ముందు పిచ్ ఎలా ప్లే చేస్తుందో తెలియదు. ఎర్రమట్టి పిచ్ కాబట్టి పేస్, బౌన్స్ బాగుంటుంది.
DY Patil Stadium సంగతి తెలీదు
డీవై పాటిల్‌లో చివరి ఐపీఎల్ గేమ్ 2011లో జరిగింది. ఇక్కడ ఎలాంటి ప్రొఫెషనల్ టీ20 మ్యాచులు జరగలేదు. రెండేళ్లుగా దీనిని ఫుట్‌బాల్ మ్యాచులకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి పిచ్ ఎలా ఉంటుందో చెప్పలేం. బౌండరీ సైజులు కూడా చిన్నవే.
MCA Stadiumలో స్పిన్నర్లు తిప్పేయొచ్చు!
పుణెలోని ఎంసీఏ స్టేడియం నల్లమట్టితో రూపొందించారు. ముంబయితో పోలిస్తే పరిస్థితులు కాస్త భిన్నం! గత నాలుగేళ్లలో ఇక్కడ ఒకే ఒక టీ20 మ్యాచ్ జరిగింది. గత చివరి 14 మ్యాచుల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 170గా ఉంది. ఆ 14 మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్టే 9సార్లు గెలిచింది. 2017 నుంచి ఐపీఎల్‌లో పేసర్లు 34 సగటుతో 8.66 ఎకానమీతో 79 వికెట్లు తీస్తే రిస్ట్ స్పిన్నర్లు 22.54 సగటుతో 31 వికెట్లు పడగొట్టారు. ఫింగర్ స్పిన్నర్లు 33.42 సగటుతో 19 వికెట్లు తీశారు. ఇక్కడ కూడా బౌండరీలు చిన్నవిగానే ఉంటాయి. (With ESPNCricinfo stats)