PBKS Vs RCB: కెప్టెన్ మారినా కలిసిరాలేదు - పంజాబ్‌పై ఆరు వికెట్లతో బెంగళూరు ఓటమి!
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 19 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఫాఫ్ డుఫ్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు అనూజ్ రావత్ (21: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), ఫాఫ్ డుఫ్లెసిస్ (88: 57 బంతుల్లో, మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు) మొదటి వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 50 పరుగులు జోడించారు. ఏడో ఓవర్ చివరి బంతికి అనూజ్ రావత్ అవుట్ కావడంతో డుఫ్లెసిస్‌కు, విరాట్ కోహ్లి (41 నాటౌట్: 29 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) జత కలిశాడు.
మొదట నిదానంగా ఆడిన వీరిద్దరూ తర్వాత వేగం పెంచారు. ఒక దశలో వీరు కేవలం ఐదు ఓవర్లలోనే 80 పరుగులు జోడించడం విశేషం. ముఖ్యంగా అర్థ సెంచరీ సాధించాక ఫాఫ్ డుఫ్లెసిస్ బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు సిక్సర్లు ఉండటం విశేషం. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 10.1 ఓవర్లలోనే 118 పరుగులు జోడించారు.
ఈ దశలో ఫాఫ్ డుఫ్లెసిస్ అవుటయినా... పంజాబ్ బౌలర్ల కష్టాలు ఎక్కువయ్యాయి తప్ప తగ్గలేదు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ (32 నాటౌట్: 14 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు విరాట్ కోహ్లీ యాంకర్ పాత్ర పోషించడంతో బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చెరో వికెట్ దక్కింది.
ఆరంభం అదిరినా...
మరోవైపు 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (43: 29 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), మయాంక్ అగర్వాల్ (32: 24 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) పవర్‌ప్లే ఆరు ఓవర్లలోనే వికెట్ ఇవ్వకుండా 63 పరుగులు జోడించారు. మొదటి వికెట్‌కు 70 పరుగుల జోడించిన అనంతరం మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేసి బెంగళూరుకు హసరంగ మొదటి వికెట్ అందించాడు.
ఆ తర్వాత శిఖర్ ధావన్, శ్రీలంక ఆటగాడు భనుక రాజపక్స (43: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) వేగం తగ్గకుండా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఆ తర్వాత ధావన్ అవుటయినా... రాజపక్స జోరు తగ్గలేదు. అయితే ఇన్నింగ్స్ 14వ ఓవర్ మొదటి రెండు బంతులకు రాజపక్స, అండర్-19 సంచలనం రాజ్ బవాలను (0: 1 బంతి) సిరాజ్ అవుట్ చేయడంతో 139 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్ (19: 10 బంతుల్లో, రెండు సిక్సర్లు) క్రీజులో కొద్దిసేపే ఉన్నా రెండు సిక్సర్లు కొట్టి వేగం తగ్గకుండా చేశాడు. ఇక చివర్లో ఒడియన్ స్మిత్ (25 నాటౌట్: 8 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్సింగ్స్ 18వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక బౌండరీతో 25 పరుగులు రావడంతో లక్ష్యం మరింత సులభం అయింది. పంజాబ్ ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు తీయగా... హర్షల్ పటేల్, వనిందు హసరంగ, ఆకాష్ దీప్‌లకు చెరో వికెట్ దక్కింది.