Kumar Kartikeya: ఐపీఎల్ ఆడేందుకు ఏడాది పాటు లంచ్ తిన్లేదు.. ముంబయి ఆటగాడి త్యాగం!
ipl 2022: ముంబయి యువ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (Kumar Kartikeya) ఎన్నో కష్టాలను అనుభవించాడని అతడి చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ అన్నారు. ఏడాది పాటు అతడు మధ్యాహ్నం భోజనం చేయలేదని పేర్కొన్నాడు.
IPL 2022 Kumar Kartikeya not eaten lunch for year: ముంబయి ఇండియన్స్ యువ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (Kumar Kartikeya) ఎన్నో కష్టాలను అనుభవించాడని అతడి చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ అన్నారు. ఏడాది పాటు అతడు మధ్యాహ్నం భోజనం చేయలేదని పేర్కొన్నాడు. తమ అకాడమీలో మధ్యాహ్నం అన్నం పెట్టినప్పుడు కన్నీరు కార్చాడని గుర్తు చేసుకున్నారు. క్రికెట్ పట్ల అతడికెంతో అంకితభావం ఉందని ప్రశసించారు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో కుమార్ కార్తికేయ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచులోనే 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీసి 19 పరుగులే ఇచ్చాడు. చక్కని ఎకానమీ మెయింటేన్ చేసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. గాయపడ్డ ఓ ఆటగాడి స్థానంలో కార్తికేయను రూ.20 లక్షల కనీస ధరతో ముంబయి తీసుకుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ అతడిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
'కుమార్ కార్తికేయ బౌలింగ్ శైలి చాలా స్మూత్‌గా ఉంటుంది. చేతివేళ్లను అతడు చక్కగా ఉపయోగిస్తాడు' అని కోచ్ భరద్వాజ్ అన్నారు. అతడు ఫీజు చెల్లించే స్థితిలో లేనప్పటికీ దిల్లీలోని తన అకాడమీలో ట్రయల్స్ ఆఫర్ చేశానని పేర్కొన్నారు. అకాడమీకి 80 కిలోమీటర్ల దూరంలోని గాజియాబాద్‌తో అతడు కూలీగా పనిచేశాడని వెల్లడించారు. రాత్రుళ్లు పనిచేసి, ఇతరులతో కలిసి బస చేశాడని తెలిపారు. బిస్కెట్ ప్యాకెట్ కోసం పది రూపాయాలు ఆదా చేసేందుకు ఉదయం పూట అకాడమీకి నడుచుకుంటూ వచ్చేవాడని గుర్తు చేసుకున్నారు.
తన అకాడమీలో చేరిన తొలిరోజు మధ్యాహ్నం భోజనం వడ్డించినప్పుడు కార్తికేయ కన్నీరు కార్చాడని భరద్వాజ గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఏడాదిగా అతడు మధ్యాహ్నం అన్నం తినలేదని తెలిపారు. 'కార్తీకేయలోని అంకితభావం, ఆత్మవిశ్వాసం, సామర్థ్యం చూసి నా స్నేహితుడు, షాదోల్ క్రికెట్ అసోషియేషన్ సెక్రెటరీ అజయ్ ద్వివేదీ వద్దకు పంపించాను. అక్కడే డివిజన్ క్రికెట్ ఆడాడు. తొలి రెండేళ్లలోనే 50+ వికెట్లు పడగొట్టాడు. ఎప్పుడు ఖాళీగా ఉన్నా నెట్స్‌లో బౌలింగ్ చేస్తుంటాడు. చాలాసార్లు మ్యాచులు ముగిశాక ఇండోర్ స్టేడియానికి వచ్చి లైట్లు వేసుకొని బౌలింగ్ చేసేవాడు. రెండు మూడు గంటలు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేవాడు. గత తొమ్మిదేళ్లలో అతడి క్రికెట్ మరింత మెరుగైంది' అని భరద్వాజ్ తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన కుమార్ కార్తికేయ గాయపడిన పేసర్ అర్షద్ ఖాన్ స్థానంలో వచ్చాడు. రాజస్థాన్ మ్యాచులో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ తరఫున 8 టీ20లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఎంపీ తరఫున రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐదు మ్యాచుల్లో 5.05 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. పొట్టి క్రికెట్టే కాకుండా మధ్యప్రదేశ్‌కు 9 ఫస్ట్‌క్లాస్, 19 లిస్ట్-ఏ మ్యాచులు ఆడాడు. వరుసగా 35, 18 వికెట్లు తీశాడు. రూ.20 లక్షల కనీస ధరతో ముంబయి అతడిని తీసుకుంది.