GT Vs SRH: సెంచరీతో చెలరేగిన గిల్ - ఐదు వికెట్లు తీసుకున్న భువీ - రైజర్స్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 189 పరుగులు కావాలి.
Sunrisers Hyderabad vs Gujarat Titans ఐపీఎల్ 2023 సీజన్ 62వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (101: 58 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో గిల్‌కు ఇదే మొదటి సెంచరీ. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రైజర్స్ విజయానికి 120 బంతుల్లో 189 పరుగులు కావాలి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను (0: 3 బంతుల్లో) భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్లోనే అవుట్ చేశాడు. అయితే అక్కడి నుంచే సన్‌రైజర్స్‌కు కష్టాలు మొదలయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (47: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101: 58 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ బౌండరీలతో చెలరేగాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ 65 పరుగులు చేసింది. ఆ తర్వాత కేవలం 22 బంతుల్లోనే అర్థశతకం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా వేగంగా ఆడారు. సన్‌రైజర్స్ చెత్త ఫీల్డింగ్ కూడా వీరికి కలిసొచ్చింది. క్యాచ్ డ్రాప్‌లు, రనౌట్ మిస్‌లు, మిస్ ఫీల్డ్‌లు ఇలా ఎన్నో అవకాశాలు ఇచ్చారు.
రెండో వికెట్‌కు 147 పరుగులు జోడించిన అనంతరం సాయి సుదర్శన్‌ను అవుట్ చేసి మార్కో జాన్సెన్ రెండో వికెట్ అందించాడు. ఆ తర్వాత గుజరాత్ ఇన్నింగ్స్ పతనం అయింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భువనేశ్వర్ వేసిన చివరి ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడ్డాయి. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, ఫజల్‌హక్ ఫరూకీ, టి నటరాజన్‌లకు తలో వికెట్ దక్కింది.
పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలోనూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే అధికారికంగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచినా తొమ్మిదో స్థానంలో ఉంటుంది. కానీ ప్లేఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగవుతాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూఖీ, టి నటరాజన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, అకేల్ హోసేన్, మయాంక్ దాగర్, నితీష్ రెడ్డి
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
యష్ దయాల్, శ్రీకర్ భారత్, దర్శన్ నల్కండే, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, శివం మావి