CSK vs PBKS IPL 2024 Preview and Prediction : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్(PBKS)తో చెన్నై సూపర్ కింగ్స్(CSK) అమీతుమీ తేల్చుకోనుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న చెన్నై... ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌తో తలపడనుంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో స్థానాన్ని పదిలం చేసుకోవాలని చెన్నై పట్టుదలగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి అయిదు విజయాలు.. నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అయితే లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అన్నే పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్క మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికను తారుమారు చేసే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్‌లో విజయం చెన్నైకు తప్పనిసరి కానుంది. మరోవైపు పంజాబ్‌కు కూడా ప్లే ఆఫ్ దారులు పూర్తిగా మూసుకుపోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం కీలకం.
సొంత మైదానంతో చెన్నైతో కష్టమే
పంజాబ్‌తో మ్యాచ్‌లో సొంత మైదానమైన చిదంబరం స్టేడియంలో అడనుండడం చెన్నైకు కలిసిరానుంది. మరోవైపు కోల్‌కత్తా టీ 20 చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న పంజాబ్... ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. చెపాక్ స్టేడియం సాధారణంగా బౌలర్లకు అనుకూలిస్తుండడంతో పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయడంపైనే చెన్నై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు చెన్నై కూడ గత మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 78 పరుగుల తేడాతో రుతురాజ్ సేన ఘన విజయం సాధించింది. రాత్రి సమయంలో చెన్నైలో మంచు కురిసే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ బౌలర్లను ఎదుర్కొని 200కుపైగా స్కోరు చేసిన చెన్నై బ్యాటర్లు... మరోసారి రాణించాలని కోరుకుంటున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై మంచి టచ్‌లో ఉండడం చెన్నైకు కలిసిరానుంది. గైక్వాడ్ తన చివరి రెండు ఇన్నింగ్స్‌లలో 108, 98 పరుగులు చేసి మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ కూడా హైదరాబాద్‌పై 32 బంతుల్లో 52 పరుగులతో సరైన సమయంలో ఫామ్‌లోకి రావడం చెన్నైకు కలిసిరానుంది. శివమ్ దూబే ప్రత్యర్థి బౌలర్లపై ఆదిపత్యం ప్రదర్శిస్తున్నాడు. దూబే ఇప్పటివరకు ఈ ఐపీఎల్‌లో 350 పరుగులు చేశాడు. ధోని కూడా చివరి ఓవర్లలో మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే ఫామ్‌లోకి వస్తే ఇక చెన్నైకు తిరుగుండదు.
పంజాబ్ అదే ఊపు కొనసాగిస్తుందా..
పంజాబ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో పైకి చేరాలంటే పంజాబ్ బ్యాటర్లు మరోసారి మంచి ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్‌స్టోపై పంజాబ్ బ్యాటింగ్ భారం ఉంది. జితేష్ శర్మ నుంచి పంజాబ్ భారీ స్కోరు ఆశిస్తోంది. కగిసో రబడా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, శామ్ కరణ్‌లు ఉన్నా పంజాబ్ బౌలింగ్ బలహీనంగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
జట్లు
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), MS ధోని, అరవెల్లి అవనీష్, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, మిచెల్ సాంట్నర్ , దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, సమీర్ రిజ్వీ.
పంజాబ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌ.