SRH vs MI Highlights: సన్‌రైజర్స్‌పై 42 పరుగులతో ముంబై విజయం.. అయినా లేదు ప్రయోజనం!
IPL 2021, SRH vs MI: ఐపీఎల్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్‌పై 42 పరుగులతో విజయం సాధించింది.
ఐపీఎల్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్‌పై 42 పరుగులతో విజయం సాధించింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు.. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినా ప్లేఆఫ్స్‌కు దూరం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 235 పరుగులు వేసింది. సన్‌రైజర్స్‌ను 65 పరుగులకు కట్టడి చేస్తే ప్లేఆఫ్స్ అవకాశం ఉండేది. అయితే సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయడంతో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.
అదరగొట్టిన ముంబై బ్యాట్స్‌మెన్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి మెరుపు ఆరంభం లభించింది. రైజర్స్‌పై భారీ తేడాతో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో.. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (84: 32 బంతుల్లో, 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు), రోహిత్ శర్మ (18: 13 బంతుల్లో, మూడు ఫోర్లు) మొదటి బంతి నుంచే చెలరేగి ఆడారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి ముంబై వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్లో రోహిత్ శర్మ అవుటైనా స్కోరు వేగం ఏమాత్రం తగ్గలేదు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఇషాన్ కిషన్ ఏమాత్రం తగ్గకపోవడంతో స్కోరు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో హార్దిక్ (10: 8 బంతుల్లో, ఒక సిక్సర్) అవుటయ్యాక, పదో ఓవర్లో ఇషాన్ కిషన్ కూడా అవుట్ అవ్వడంతో స్కోరు వేగం కాస్త మందగించింది. 10 ఓవర్లకు ముంబై మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 131 పరుగులు చేయగలిగింది.
ఇన్నింగ్స్ మొదటి పది ఓవర్లలో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడగా.. చివరి పది ఓవర్లలో ఆ బాధ్యతను సూర్యకుమార్ యాదవ్ (82: 40 బంతుల్లో, 13 ఫోర్లు, మూడు సిక్సర్లు) తీసుకున్నాడు. చివర్లో స్కోరు వేగం కాస్త తగ్గినా ముంబై 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 235 పరుగులు సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో హోల్డర్ నాలుగు, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు తీసుకోగా.. ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీసుకున్నారు.
హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ కూడా..
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ కూడా అదిరిపోయేలా ప్రారంభం అయింది. జేసన్ రాయ్ (34: 21 బంతుల్లో, ఆరు ఫోర్లు), అభిషేక్ శర్మ (33: 16 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి బంతి నుంచే చెలరేగి ఆడారు. వీళ్లిద్దరూ మొదటి వికెట్‌కు 5.2 ఓవర్లలోనే 64 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రాయ్, ఏడో ఓవర్లో అభిషేక్ శర్మ అవుటయినా స్కోరు వేగం తగ్గలేదు. ఈ టోర్నీలో మనీష్ పాండే (69 నాటౌట్: 41 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తొలిసారి చెలరేగి ఆడాడు. అతని కారణంగానే హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో పోరాడగలిగింది. ప్రియం గర్గ్ (29: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) మినహా ఇంకెవరూ మనీష్‌కు సహకరించలేదు. దీంతో హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో జిమ్మీ నీషం, కౌల్టర్ నైల్, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, పీయూష్ చావ్లా చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో ముంబై.. సన్‌రైజర్స్‌ను 65 పరుగులకే కట్టడి చేస్తే ప్లేఆఫ్స్ అవకాశం లభించేది. అయితే ముంబై అందులో విఫలం కావడంతో.. కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అక్టోబర్ 10వ తేదీన జరగనున్న మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ, చెన్నై తలపడనున్నాయి. 11వ తేదీన జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు, కోల్‌కతా తలపడనున్నాయి.
Also Read: ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో?
Also Read: బాలీవుడ్‌లో అడుగుపెడతారా? ధోనీ ఏం చెప్పాడంటే..!