IPL 2021, DC vs SRH: బెబ్బులి దిల్లీపై సన్‌రైజర్స్ గెలిచేనా? బాహుబలి వార్నర్ మెరుపులు చూస్తామా!
దిల్లీ తొలి టైటిల్ అందుకోవాలని పట్టుదలతో ఉంది. తొలి దశ ముగిసే సమయానికి 8 మ్యాచుల్లో 6 గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు 2016 విజేతైన సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది.
ఒకటేమో ఆరు విజయాలు సాధించి దుమ్మురేపుతోన్న జట్టు. మరొకటేమో ఆరు అపజయాలతో ఆఖర్లో నిలబడిన జట్టు. ఒకరికి ప్రతి మ్యాచూ ప్రాణ సంకటమే. మరొకరికి ఒక్కటి గెలిచినా సంతోషమే. అవే దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్లేఆఫ్స్ చేరేందుకు తహతహలాడుతున్న రిషభ్ పంత్ సేనకు పరువుకోసం ప్రయత్నిస్తున్న విలియమ్సన్ బృందానికీ నేడే పోరు.
దిల్లీ.. తహతహ
రెండేళ్లుగా తిరుగులేని ఆటతీరుతో సాగుతోంది దిల్లీ. తొలి టైటిల్ అందుకోవాలని పట్టుదలతో ఉంది. ఈసారీ అదే జోరుతో సీజన్‌ను ఆరంభించింది. తొలి దశ ముగిసే సమయానికి 8 మ్యాచుల్లో 6 గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు 2016 విజేతైన సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. రెండేళ్లుగా ప్లేఆఫ్స్ చేరుతూ ఆకట్టుకున్న ఈ జట్టు ఈ సారి మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. తొలి దశలో ఏడు మ్యాచులాడి ఆరు ఓడి 2 పాయింట్లతో అట్టడుగున నిలిచింది.
ఇంట్రెస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఇప్పటి వరకు హైదరాబాదే
దిల్లీపై ఇప్పటి వరకు సన్‌రైజర్స్‌దే పైచేయి. ఈ రెండు జట్లు 19 సార్లు తలపడగా 11 సార్లు హైదరాబాదే గెలిచింది. దిల్లీ ఏడుసార్లే విజయం అందుకుంది. అయితే చివరి ఐదు మ్యాచుల్లో మాత్రం దిల్లీ మెరుగైంది. ఏకంగా మూడింట్లో గెలిచింది. ఈ సీజన్లో చివరిసారి తలపడ్డ మ్యాచ్ మాత్రం అద్భుతం. దిల్లీ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సమం చేసింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీయగా హైదరాబాద్ చేసిన 7 పరుగుల్ని దిల్లీ ఛేదించేసింది.
Also Read: PBKS vs RR Match Preview: దంచుడే దంచుడు.. ఐపీఎల్ సిక్సర్ల మ్యాచుకు మీరు సిద్ధమేనా!
మరింత పటిష్ఠంగా పంత్ సేన
ప్రస్తుతం ఏ రకంగా చూసిన దిల్లీయే పటిష్ఠంగా కనిపిస్తోంది. సీజన్ మొదటి దశలో పవర్‌ప్లేలో ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా రెచ్చిపోయారు. టాప్ స్కోరర్లుగా ఉన్నారు. వారికి తోడుగా మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగొచ్చేశాడు. ప్రపంచంలోని గొప్ప ఫినిషర్లలో ఒకడిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. గాయపడ్డ సింహంలా కనిపిస్తున్నాడు. రెండేళ్ల నుంచి పంత్ స్ట్రైక్‌రేట్ తగ్గినా పరిణతి కనిపిస్తోంది. స్టాయినిస్, స్మిత్, హెట్‌మైయిర్, అక్షర్ పటేల్, అశ్విన్ వరకు బ్యాటింగ్ చేస్తారు. ఇక అవేశ్ ఖాన్, ఆన్రిచ్ నార్జ్, రబాడా, అశ్విన్, అక్షర్, స్టాయినిస్ బౌలింగ్‌కు తిరుగులేదు. టీ20 క్రికెట్లో 250 వికెట్ల ఘనతకు యాష్ ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.
పేలవంగా మారిన సన్‌రైజర్స్
సీజన్ ఆరంభంతో పోలిస్తే సన్‌రైజర్స్ మరింత పేలవంగా మారింది. జట్టులో ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో దుబాయ్‌కి రాలేదు. అతడి స్థానంలో వచ్చిన షెర్పానె రూథర్‌ఫర్డ్ ఫర్వాలేదు. సీపీఎల్‌లో 11 మ్యాచుల్లో 127 స్ట్రైక్‌రేట్‌తో 262 పరుగులు చేశాడు. కానీ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తొలగించిన డేవిడ్ వార్నర్ ఎంత వరకు ఆడతాడో చెప్పలేని పరిస్థితి. కెప్టెన్ కేన్ విలియమ్సన్ పైనే ఆశలన్నీ పెట్టుకుంది జట్టు. మిడిలార్డర్‌లో మనీశ్ పాండే, అబ్దుల్ సమద్, కేదార్ జాదవ్‌పై నమ్మకం తక్కువే. భువనేశ్వర్ గతంలో మాదిరిగా వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. గతంలో అతడి ఎకానమీ ఎప్పుడూ 8 దాటలేదు. ఈ సీజన్ తొలిదశలో 9 దాటడం ఆందోళన కలిగిస్తోంది. సందీప్ శర్మా పరుగులిస్తున్నాడు. టి.నటరాజన్ తిరిగి రావడం సంతోషకరం.
జట్లు (అంచనా)
దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కె), స్టాయినిస్, హెట్‌మైయిర్, అక్షర్ పటేల్, అశ్విన్, కాగిసో రబాడా, ఆన్రిచ్ నార్జ్, అవేశ్ ఖాన్
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్/మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి