PBKS vs RR Match Preview: దంచుడే దంచుడు.. ఐపీఎల్ సిక్సర్ల మ్యాచుకు మీరు సిద్ధమేనా!
కళ్లు చెదిరే సిక్సర్లు వీక్షించేందుకు టైమొచ్చేసింది. ఎందుకంటే మంగళవారం దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అసలైన మజాకు వేళైంది. కళ్లు చెదిరే సిక్సర్లు వీక్షించేందుకు టైమొచ్చేసింది. ఎందుకంటే మంగళవారం దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. రెండు జట్లలోనూ బిగ్ హిట్లర్లు ఉండటంతో అభిమానులకు ఈరోజు సిక్సర్ల పండగే మరి!
గెలుపు కీలకం
ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్ పాయింట్ల పట్టికలో బాటమ్ ఫోర్‌లో ఉన్నాయి. సీజన్ తొలిదశలో చెరో మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో ఉన్నాయి. మెరుగైన రన్‌రేట్‌తో సంజు శాంసన్ సేన ఆరో స్థానంలో ఉంది. రాహుల్ బృందం ఏడో స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌తో పోలిస్తే పంజాబ్ ఒక మ్యాచ్ ఎక్కువగానే ఆడటం గమనార్హం. ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే అద్భుతంగా ఆడాలి. వరుస విజయాలు సాధించాలి.
పంజాబ్‌దే పైచేయి!
ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 22 సార్లు తలపడగా పంజాబ్ 12 గెలిచి 9 ఓడింది. ఒక మ్యాచ్ టై అయింది. చివరి ఐదు మ్యాచుల్లోనూ కింగ్స్‌దే ఆధిపత్యం. మూడింట్లో గెలిచింది. ఈ మధ్యకాలంలో వీరెప్పుడు తలపడ్డా పరుగుల వరద పారుతోంది. ప్రతి రెండుమ్యాచులకు ఒకసారి కనీసం 200 పరుగులైనా చేస్తున్నారు. లేదా ఛేదిస్తున్నారు.
ఈ సీజన్ తొలి పోరులో రాహుల్ (91; 50 బంతుల్లో 7x4, 5x6), క్రిస్‌గేల్ (40; 28 బంతుల్లో 4x4, 2x6), దీపక్ హుడా (64; 28 బంతుల్లో 4x4, 6x6) దంచికొట్టడంతో పంజాబ్ 221 పరుగులు చేసింది. ఛేదనలో సంజు శాంసన్ (119; 63 బంతుల్లో 12x4, 7x6) దంచికొట్టడంతో రాజస్థాన్ 217 పరుగులు చేసింది. గత సీజన్లో పంజాబ్ నిర్దేశించిన 224ను రాజస్థాన్ (226) ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
అంతా హిట్లర్లే!
ఈ మ్యాచులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుక్ ఖాన్, లియామ్ లివింగ్‌స్టన్, సంజు శాంసన్, ఇవిన్ లూయిస్‌పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు టీ20లకు పనికిరాడని పక్కనపెట్టేసిన లియామ్ లివింగ్ స్టన్ ది హండ్రెడ్‌లో చుక్కలు చూపించాడు. సరికొత్త షాట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
విండీస్ విధ్వంసకర ఆటగాడు లూయిస్ ఎలా సిక్సర్లు కొడతాడో అందరికీ తెలుసు. ఇక సంజు శాంసన్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. క్రీజులో నిలబడి దంచగలడు. ఇక రాహుల్ అటు క్లాస్, ఇటు మాస్ బ్యాటింగ్‌తో మెప్పిస్తాడు. క్రిస్‌గేల్, నికోలస్ పూరన్ విధ్వంసాలకు సాటిలేదు. హుడా, షారుక్, మయాంక్ ఫామ్‌లోకి వస్తే పంజాబ్‌కు తిరుగుండదు.
Also Read: BCCI on Match Fee Hike: దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. ఇక భారీగా జీతాలు
బౌలర్లే కీలకం
పంజాబ్ బౌలింగ్‌లో మహ్మద్ షమి రాణించడం అత్యంత కీలకం. కొత్తగా వచ్చిన నేథన్ ఎలిస్, యువ పేసర్ అర్షదీప్ మెరుపులు మెరిపించాలి. రవి బిష్ణోయ్ సంగతి తెలిసిందే. కుంబ్లే శిక్షణలో రాటుదేలుతున్నాడు. రాజస్థాన్‌కు క్రిస్ మోరిస్ అండదండలు ఉన్నాయి. డెత్ ఓవర్లలో అతడు వికెట్లు తీస్తున్నాడు. ఇక బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్‌ను తక్కువ అంచనా వేస్తే పంజాబ్‌కు అంతే సంగతులు. చేతన్ సకారియా, కార్తీక్ త్యాగీ, రాహుల్ తెవాతియా బౌలింగ్‌లో ఆకట్టుకోగలరు.