IND vs SA, 1st Test: భారత్- సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో గ్యాలరీలు ఖాళీ.. ఒమిక్రాన్ భయంతోనే!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి టెస్ట్ ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించనున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ ప్రకటించింది.
సౌతాఫ్రికాతో భారత్ తలపడునున్న టెస్ట్ సిరీస్‌ను ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఆ దేశంలో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతుండటమే ఇందుకు కారణం. దీంతో నిర్వహకులు కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి తొలి టెస్టుకు ప్రేక్షకుల్ని అనుమతించడం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి.
డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టును కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే టికెట్లు కూడా అమ్మకానికి పెట్టలేదని సమాచారం.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. టెస్టు సిరీస్ కోసం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆఫ్రికా గడ్డ మీద టీమిండియా ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు.
షెడ్యూల్ ఇదే..
- తొలి టెస్టు డిసెంబర్ 26-30
- రెండో టెస్టు జనవరి 03-07
- చివరి టెస్టు జనవరి 11-15
- జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.
టెస్ట్ జట్టు..
విరాట్ కోహ్లీ ( కెప్టెన్), ప్రియాంక్ పంచల్, కే ఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
రోహిత్ శర్మ దూరం..
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది. పరిమిత ఓవర్ల క్రికెట్ సారథిగా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అతడి పిక్క కండరాలు పట్టేయడంతో టెస్టు సిరీసు మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ క్రికెటర్ ప్రియాంక్ పంచాల్‌ను ఎంపిక చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి