IND vs END, U19 WC Final: రాజ్ బవా హవా.. ఐదు వికెట్లతో ఇంగ్లండ్ వెన్ను విరిచిన పేసర్.. భారత్ లక్ష్యం ఎంతంటే?
భారత్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ రాజ్ బవా ఐదు వికెట్లు తీశాడు.
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో 190 పరుగులు చేస్తే.. భారత్ ఐదోసారి అండర్-19 వరల్డ్ కప్ సాధించినట్లే. ఇంగ్లండ్ బ్యాటర్ జేమ్స్ రూ (95: 116 బంతుల్లో, 12 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో రాజ్ బవా ఐదు వికెట్లు తీయగా.. రవికుమార్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. కౌశల్ తాంబేకు ఒక్క వికెట్ లభించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు తమ నిర్ణయం తప్పని తెలియడానికి ఎంతో సేపు పట్టలేదు. భారత పేసర్లు రాజ్ బవా, రవి కుమార్‌లు ఇంగ్లండ్‌ను వణికించారు. దీంతో 13 ఓవర్లలో 47 పరుగులకే ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లండ్ కనీసం 100 పరుగులు అయినా చేస్తుందా అనే అనుమానాలు తలెత్తాయి.
జేమ్స్ రూకు కాసేపు సహకరించిన రెహాన్ అహ్మద్, అలెక్స్ హోర్టన్‌లు కూడా అవుట్ కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. అయితే జేమ్స్ సేల్స్, జేమ్స్ రూ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 93 పరుగులు జోడించడం విశేషం. సెంచరీకి ఐదు పరుగుల ముంగిట జేమ్స్ రూ అవుట్ అయ్యాడు.
దీంతో ఇంగ్లండ్ ఆ తర్వాత వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. 190 పరుగులు చేస్తే భారత్ ఐదోసారి అండర్-19 వరల్డ్ కప్‌ను సాధించనుంది.
View this post on Instagram