NZ vs AUS, Final Match Highlights: కివీ రెక్కలు విరిచిన కంగారూలు.. మొదటిసారి కప్పు కొట్టిన ఆసీస్
ICC T20 WC 2021, NZ vs AUS Final: టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మొదటి వరల్డ్ కప్‌ను సాధించింది.
ఆస్ట్రేలియా 14 సంవత్సరాల కల ఎట్టకేలకు నెరవేరింది. పొట్టి ఫార్మాట్‌లో మొట్టమొదటిసారి విశ్వవిజేతగా నిలిచింది. 2007లో మొదటి టీ20 వరల్డ్ కప్ జరిగినప్పటి నుంచి ఆస్ట్రేలియా ట్రోఫీ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. వారి ప్రయత్నం ఎట్టకేలకు ఈ వరల్డ్‌కప్‌లో ఫలించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటిసారి ఫైనల్‌కు చేరుకున్న న్యూజిలాండ్‌కు నిరాశే ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
విలియమ్సన్ వన్‌మ్యాన్ షో..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు అంత మంచి ఆరంభం లభించలేదు. ఫాంలో ఉన్న డేరిల్ మిషెల్‌ను (11: 8 బంతుల్లో, ఒక సిక్సర్) నాలుగో ఓవర్లోనే అవుట్ చేసి జోష్ హజిల్‌వుడ్ ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత గుప్టిల్ (28: 35 బంతుల్లో, మూడు ఫోర్లు), కేన్ విలియమ్సన్ (85: 48 బంతుల్లో, 10 ఫోర్లు, మూడు సిక్సర్లు) కాస్త నిదానంగా ఆడటంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 32 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కాస్త నిదానంగా ఆడటంతో 10 ఓవర్లకు స్కోరు 57 పరుగులకు చేరింది.
డ్రింక్స్ బ్రేక్ ముగిశాక 11వ ఓవర్లో 21 పరుగుల వద్ద కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను జోష్ హజిల్ వుడ్ డ్రాప్ చేశాడు. 12వ ఓవర్లలో మార్టిన్ గుప్టిల్ అవుటయ్యాడు. ఆ తర్వాత విలియమ్సన్ పూర్తిగా బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. ఆడం జంపా, మిషెల్ స్టార్క్ వంటి టాప్ క్లాస్ బౌలర్లను కూడా ఒక ఆటాడుకున్నాడు. స్టార్క్ వేసిన 16వ ఓవర్లో నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్‌తో ఏకంగా 22 పరుగులను విలియమ్సన్ రాబట్టాడు. ఈ క్రమంలోనే తన అర్థ సెంచరీ కూడా పూర్తయింది.
అయితే 18వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ (18: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), కేన్ విలియమ్సన్‌లను అవుట్ చేసి హజిల్‌వుడ్ ఆస్ట్రేలియాను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత జిమ్మీ నీషం, టిమ్ సిఫెర్ట్ కాస్త వేగంగా ఆడటంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హజిల్‌వుడ్ మూడు వికెట్లు తీయగా.. జంపాకు ఒక వికెట్ దక్కింది.
దారుణంగా విఫలమైన న్యూజిలాండ్ బౌలర్లు
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కాస్త నిదానంగానే ప్రారంభం అయింది. మూడో ఓవర్లో 15 పరుగులకే ఆరోన్ ఫించ్ (5: 7 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిషెల్ మార్ష్ (77 నాటౌట్: 50 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (53: 38 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు వికెట్ నష్టానికి 43 పరుగులకు చేరుకుంది.
కొట్టాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో వీరిద్దరూ అసలు రన్‌రేట్ పడిపోకుండా ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లకు అస్సలు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 82 పరుగులకు చేరుకుంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్ వార్నర్.. 13వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అయితే మార్ష్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాటింగ్ చేశాడు. అతనికి మ్యాక్స్‌వెల్ (28 నాటౌట్: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా తోడవ్వడంతో ఆస్ట్రేలియా ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. తను తప్ప మిగతా బౌలర్లెవరూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
Also Read: T20 World Cup 2021: మీమ్ క్రియేటర్లకు షాక్..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!
Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి