T20 World Cup 2021: మీమ్ క్రియేటర్లకు షాక్..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!
మీమర్స్‌తో కలిసి మద్యం సేవిస్తానని రవిశాస్త్రి అంటున్నాడు. అదీ ఒకరకమైన కళేనని తెలిపాడు. కఠిన సమయాల్లో మీమ్స్ నవ్వు తెప్పిస్తాయని పేర్కొన్నాడు.
టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మీమ్ క్రియేటర్లకు షాకిచ్చాడు! కలిసి మద్యం సేవించేందుకు వారిలో కొందరిని ఆహ్వానిస్తానని అంటున్నాడు. అంతేకాకుండా కొన్ని మీమ్స్ నవ్వు తెప్పిస్తాయని తెలిపాడు. వాటిని తాను కూడా ఆస్వాదిస్తానని వెల్లడించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియా కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి దిగిపోయాడు. అతడితో రెండేళ్ల ఒప్పందం ముగిసింది. 60 ఏళ్లకు చేరుకోవడంతో అతడి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే కోహ్లీసేన ఓడిపోయినప్పుడు చాలాసార్లు రవిశాస్త్రిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగేది. కొందరు మీమ్ క్రియేటర్లు అతడిని మద్యం సేవిస్తున్నట్టుగా, మద్యం సీసాలు చేతుల్లో పట్టుకున్నట్టు, మద్యం గ్లాసులు పట్టుకొని బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా చిత్రీకరించేవాళ్లు. దాని గురించి అడగ్గా శాస్త్రి చెప్పిన జవాబు ఆశ్చర్యపరిచింది!
'నేను కొన్ని మీమ్స్‌ను ఎంజాయ్ చేశాను. అదీ ఒక నైపుణ్యమే! వాళ్లు నాకు పొట్ట పెరిగినట్టు చూపించిన మరుసటి రోజే అది మాయం అయ్యేది!' అని శాస్త్రి అన్నాడు. 'ఎక్కడ చూసినా సీసాలు కనిపించేవి. అవి చూసి నవ్వుకునే వాడిని. ఎందుకంటే కొన్ని కఠిన సమయాల్లో మంచి హాస్యం అవసరం. మీమ్ క్రియేటర్లలో కొందరిని ఆహ్వానించి వారితో మద్యం సేవిస్తా' అని రవిశాస్త్రి తెలిపాడు.
రవిశాస్త్రి కోచింగ్ హయాంలో టీమ్‌ఇండియా చాలా విషయాల్లో మెరుగైంది. ప్రపంచంలో ఎక్కడైనా బౌలింగ్ చేసే బౌలర్లు తయారయ్యారు. పేస్ బౌలింగ్ విభాగం బలంగా మారింది. స్వింగ్ పిచ్‌లకు బ్యాటర్లు భయపడటం మానేశారు. ఓడిపోయినా పోరాడటం నేర్చుకున్నారు. విదేశాల్లో ద్వైపాక్షిక సిరీసులు గెలిచారు. అయితే ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడం మాత్రం లోటే!
'నా పదవీకాలంలో అన్నిటి కన్నా ఎక్కువగా సంతృప్తి లభించింది. ఈ ఉద్యోగంలో ఎప్పుడూ కోచింగ్ స్టాఫ్‌తో ఉండాల్సి వస్తుంది. మైదానంలో స్వేచ్ఛగా, మెరుగ్గా ఆడేలా ఆటగాళ్ల మానసిక ధోరణి మార్చాల్సి ఉంటుంది. వారు బాగా రాణించేలా చేయాల్సి ఉంటుంది. అదీ నాకెంతో సంతృప్తినిచ్చింది. గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. రెండో ప్రపంచయుద్ధం కాలంలో మాదిరిగా కొన్నాళ్లు క్రికెట్టే జరగలేదు' అని శాస్త్రి వెల్లడించాడు.
Also Read: India Tests Squad Against NZ: టీమ్‌ఇండియాలోకి విశాఖ కుర్రాడు.. కివీస్ టెస్టు సిరీసుకు భారత జట్టిదే
Also Read: T20 WC 2021: 4 జట్లతో ఆడుకున్న '6' సెంటిమెంట్..! ముందు విజయం సెమీస్‌లో పరాభవం..!
Also Read: Hasan Ali Troll: హసన్ అలీకి అండగా భారతీయులు.. పాక్ పేసర్‌కు మద్దతుగా #INDwithHasanAli ట్రెండింగ్
Also Read: AUS Vs NZ: కేన్ మామ వర్సెస్ డేవిడ్ భాయ్.. అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి