WPL 2023: మహిళల క్రికెట్ పండుగ మొదలవుతుంది - మొదటి మ్యాచ్ ఎవరికో తెలుసా?
మహిళల ప్రీమియర్ లీగ్‌లో మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది.
GG-W Vs MI-W WPL 2023 Live Streaming: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మొదటి ఎడిషన్‌కు ఇంకా 24 గంటల కంటే తక్కువ సమయం ఉంది. ఈ టీ20 లీగ్ తొలి మ్యాచ్ మార్చి 4వ తేదీన ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్టు మధ్య జరగనుంది. ఈ సీజన్ మొత్తం స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ రెండు జట్ల గురించి మాట్లాడినట్లయితే వీటిలో అద్భుతమైన మహిళా ఆటగాళ్ల పేర్లను చూడవచ్చు. ఆస్ట్రేలియన్ మహిళల క్రికెట్ జట్టు వెటరన్ ప్లేయర్ బెత్ మూనీ గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ముంబై ఇండియన్స్ మహిళల జట్టు కెప్టెన్సీని అప్పగించారు.
డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తొలి ఎడిషన్‌లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. ఇందులో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో పాటు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు ఉన్నాయి.
ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడవచ్చు?
గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్ల మధ్య జరిగే ఈ సీజన్ మొదటి మ్యాచ్‌ను మొత్తం సీజన్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కలిగి ఉన్న స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాత్రి 7:30 గంటలకు చూడవచ్చు. ఈ మ్యాచ్ ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్‌ను సినిమా యాప్, వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. మ్యాచ్‌ను 4కే స్ట్రీమింగ్ చేసే అవకాశం కూడా ఉంది.
బలంగా కనిపిస్తున్న ముంబై
ముంబై ఇండియన్స్ అత్యంత బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, పూజా వస్త్రాకర్ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించగలరు. ముంబైలో హర్మన్‌కు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఆమెకిది అచ్చొచ్చిన నగరం. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నాట్ షవర్ బ్రంట్ స్పిన్, పేస్‌ను సునాయసంగా ఆడగలదు. మీడియం పేస్ బౌలింగ్‌తో అదరగొట్టగలదు. బంతిని రెండువైపులా స్వింగ్ చేసే పూజా వస్త్రాకర్ లోయర్ ఆర్డర్లో భారీ సిక్సర్లు దంచగలదు. ప్రతి విభాగంలోనూ ముంబైకి ప్రత్యామ్నాయ క్రికెటర్లు ఉన్నారు. అటాకింగ్ వికెట్ కీపర్ లేకపోవడం లోటు. హేలీ మాథ్యూస్, అమెలియా కెర్ కీలకం అవుతారు.
సమతూకంతో గుజరాత్ జెయింట్స్
గుజరాత్ జెయింట్స్ వేలంలో సమతూకమైన జట్టును ఎంపిక చేసింది. స్నేహ్ రాణా బంతిని చక్కగా ఫ్లైట్ చేయగలదు. ముంబై పిచ్‌లపై ఆమె కీలకం అవుతుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌లో ప్రాధాన పాత్ర పోషించిన యాష్లే గార్డ్‌నర్ ఇందులోనే ఉంది. బ్యాటు, బౌలింగ్‌తో ఆమె మాయ చేయగలదు. మిడిలార్డర్లో భారీ సిక్సర్లు దంచగలదు. బ్యాటింగ్, బౌలింగులో మంచి ఆప్షన్లు ఉన్నాయి. కెప్టెన్ బెత్‌మూనీ నిలిచిందంటే పరుగుల వరదే. అనబెల్ సుథర్ డియాండ్రా డాటిన్ బంతి, బ్యాటుతో దుమ్మురేపుతారు. హర్లీన్ డియోల్, ఎస్ మేఘనా, డీ హేమలతకు ఎక్కువ అనుభవం లేకపోవడం కాస్త ఇబ్బందికరం.