India vs New Zealand Semi Final: ధోనీ రనౌట్ కాదు ఈ 12 ఏళ్ల సెంటిమెంట్ చూడండి- గెలుపు ఎవరిదో తెలుస్తుంది!
India vs New Zealand Semi Final 2023: న్యూజిలాండ్‌తో సెమీస్ అనగానే.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌లో కాస్త అలజడి మొదలైంది. ఎక్కడ 2019 తరహా ఫలితం రిపీట్ అవుతుందేమోనన్న దిగులు కమ్మేసింది.
IND vs NZ Semi Final 2023: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో ఓటమన్నదే ఎరగకుండా టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో సాధికార విజయాలతో నాకౌట్ దశకు చేరింది. గ్రూప్ స్టేజ్‌లో భారత్‌ను ఓడించే జట్టే రాలేదు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిదింటిలో గెలిచి అపజయమే లేని జట్టుగా నిలిచింది. ఇంత చేసినా న్యూజిలాండ్‌తో సెమీస్ అనగానే.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌లో కాస్త అలజడి మొదలైంది. ఎక్కడ 2019 తరహా ఫలితం రిపీట్ అవుతుందేమోనన్న దిగులు కమ్మేసింది. అయితే టీం ఇండియా ఫాం లో ఉండటం తో పాటూ 12 ఏళ్ల సెంటిమెంట్ కూడా టీమిండియాకు అనుకూలంగా ఉంది. అదేంటంటే..
అది 2011 వన్డే వరల్డ్ కప్.. దీనిని ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించాయి. అప్పుడు న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో జరిగింది.
అలాగే 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసా మెల్‌బోర్న్‌లో.
ఇక 2019 వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లండన్‌లో జరిగింది.
ఈ లెక్కన వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన జట్టు చేతిలో న్యూజిలాండ్ సెమీ ఫైనల్ ఆడినా, ఫైనల్ ఆడినా కచ్చితంగా ఓటమి పాలవుతుంది.
ఇక ఇప్పుడు ఇండియా-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అలాగే ఈ వరల్డ్ కప్‌కు ఇండియానే ఆతిథ్యం ఇస్తుంది కనక.. ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే సెమీస్‌లో కూడా న్యూజిలాండ్‌కు ఓటమి తప్పదు.
అయితే ఈ సెంటిమెంట్ తో పాటూ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఈసారి కప్పు కొట్టడం ఖాయమని మాజీలు కూడా అంచనా వేస్తున్నారు. అన్ని కలిసొస్తే... ఇదే ఫామ్ కొనసాగితే టీమిండియా ఖాతాలో మరో కప్పు చేరడం ఖాయం. మహా సంగ్రామంలో విశ్వ విజేతగా భారత జట్టు నిలవడం తధ్యం. ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లన్నీ ఏకపక్షంగా సాగడమే ఈసారి భారత జట్టు ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, రాహుల్, శ్రేయస్స్ అయ్యర్ ఇలా అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు.
ఇప్పుడు టీమిండియా బౌలింగ్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందన్నది కాదనలేని వాస్తవం. బుమ్రా, సిరాజ్, షమీలతో కూడిన భారత పేస్ త్రయాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్ల తరం కావడం లేదు. బౌలింగ్‌లో వీరి ధాటికి తట్టుకోలేక దిగ్గజ జట్లే చతికిల పడుతున్నాయి. ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే కప్పు ముచ్చటగా మూడోసారి కప్పు మన ఖాతాలో చేరినట్లే.
ఈ మెగా టోర్నీలో తాము పాటించిన గేమ్ ప్లాన్ ఏంటనేది హిట్ మ్యాన్ వెల్లడించాడు. టోర్నీ ప్రారంభం నుంచి తాము ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టి అందులో విజయం సాధించడానికి ఏం చేయాలనే దాని గురించే ఆలోచించామని చెప్పాడు. తమ ముందున్న మ్యాచ్ గురించి మాత్రమే ఆలోచించామని.. సెమీస్, ఫైనల్ ఇలా ముందస్తు ఆలోచనలు చేయలేదని స్పష్టం చేశాడు. ఇక ముందూ అలానే చేస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. ప్రపంచకప్ రెండే అడుగుల దూరంలో ఉన్న సమయంలో న్యూజిలాండ్ మ్యాచ్ గురించే తమ ప్రణాళికలన్నీ ఉంటాయని.. ఫైనల్ గురించి అప్పుడే ఆలోచించడం లేదని కూడా పరోక్షంగా వెల్లడించారు. ప్రపంచకప్ సుదీర్ఘమైన టోర్నమెంట్ అని... విభిన్న వేదికల్లో విభిన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సి ఉంటుందని.. మేం కుడా అలాగే ఆడి విజయం సాధించామని రోహిత్ చెప్పాడు.