Australia Women Cricketers Molested: ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన.. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Australia cricketers molested in Indore | ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై వేధింపులు. 2025 మహిళా ప్రపంచ కప్ సందర్భంగా భారత్ వచ్చిన క్రీడాకారిణులపై లైంగిక దాడి.

Australia women cricketers molested in India: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ టీం ప్లేయర్లతో భారత్‌లో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. ఆస్ట్రేలియా జట్టు వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు ప్రస్తుతం భారత్‌లో ఉంది. అయితే ఇండోర్ లో ఓ బైకర్ ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను అభ్యకరంగా తాకుతూ వారితో అనుచితంగా ప్రవర్తించాడు.
ఇండోర్ అడిషనల్ డిసిపి రాజేష్ దండోటియా ప్రకారం.. గురువారం (అక్టోబర్ 23న) ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఇద్దరు మహిళా క్రీడాకారిణులు హోటల్ రాడిసన్ బ్లూ నుంచి సమీపంలోని కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి వారిని అనుసరించి తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ వెంటనే బైక్‌తో నిందితుడు పరారయ్యాడు. ఆస్ట్రేలియా మహిళల జట్టు భారతదేశంలో వన్డే ప్రపంచ కప్ ఆడటానికి వచ్చిందని తెలిసిందే.
ఆస్ట్రేలియా ప్లేయర్లు వెంటనే జట్టు భద్రతా అధికారి డెన్నీ సిమన్స్ కు ఎస్ఓఎస్ నోటిఫికేషన్ పంపారు. ఆ తర్వాత సెక్యూరిటీ టీమ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంఐజి పోలీస్ స్టేషన్ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సిసిటివి ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడ్ని ఆజాద్ నగర్‌కు చెందిన అఖిల్ ఖాన్ అని గుర్తించారు. ఈ ఘటనతో అంతర్జాతీయ క్రీడాకారులు సిటీలో ఉన్నప్పుడు ఇండోర్ పోలీసుల భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఆస్ట్రేలియా క్రీడాకారులతో అసభ్య ప్రవర్తన
ఈ కేసుపై ఇండోర్ అడిషనల్ డిసిపి రాజేష్ దండోటియా స్పందించారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడు అఖీల్ ఖాన్‌ను అరెస్టు చేశామన్నారు. హోటల్‌లో పోలీసులు ఉన్నారని, అయితే సెక్యూరిటీ విషయంలో ఎక్కడ లోపం జరిగిందో పరిశీలిస్తున్నామని తెలిపారు.
మహిళా క్రికెటర్లకు వేధింపులపై క్రికెట్ ఆస్ట్రేలియా
హోల్కర్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన మరుసటి రోజు ఆస్ట్రేలియా మహిళా జట్టులోని ఇద్దరు క్రికెటర్లు ఇండోర్‌లోని ఒక కేఫ్‌కు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో ఒక బైకర్ వారిని ఫాలో అయి అనుచితంగా తాకినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. ఈ విషయాన్ని జట్టు భద్రతా సిబ్బంది పోలీసులకు రిపోర్ట్ చేశారని తెలిపింది.
The person identified as Aqueel Khan has been arrested for molesting Australian women’s team members in Indore. pic.twitter.com/VUSCyy0puQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 25, 2025
సెమీ-ఫైనల్‌కు ఆస్ట్రేలియా
మహిళల ప్రపంచ కప్ 2025 చివరి దశకు చేరుకుంటోంది. నాలుగు జట్లు సెమీఫైనల్స్ కు చేరగా జాబితాలో తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, భారతదేశం కూడా సెమీ-ఫైనల్ చేరాయి.





















