AUS vs AFG: కంగారులు ఎలా స్పందిస్తారో, ఆస్ట్రేలియాను టీజ్ చేసిన అప్గాన్ ప్లేయర్
ODI World Cup 2023: సంచలనాలతో సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకున్న అఫ్గాన్, ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే అఫ్గాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ చేసిన కామెంట్స్ మ్యాచ్‌పై ఆసక్తిని పెంచాయి
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస సంచలనాలతో అఫ్గానిస్థాన్ దూసుకుపోతోంది. సెమీస్ అవకాశాలు ఇప్పటికీ సజీవంగా ఉంచుకున్న అఫ్గాన్ జట్టు రేపు(మంగళవారు) ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ప్రపంచకప్ మాజీ ఛాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలకు షాక్ ఇచ్చిన అఫ్గాన్... ఇప్పుడు ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ చేసిన కామెంట్స్... ఈ మ్యాచ్‌పై ఆసక్తిని మరింత పెంచాయి. ఆస్ట్రేలియాను లక్ష్యంగా చేసుకుని నవీన్ ఉల్ హక్ కామెంట్స్ చేయడంతో అసలే స్లెడ్జింగ్‌కు మారుపేరైన ఆస్ట్రేలియా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇంతకీ నవీన్ ఎమన్నాడంటే..
ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా అఫ్గానిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉంది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. కంగారుల నిర్ణయంతో అఫ్గాన్ జట్టు తీవ్ర నిరాశకు గురైంది. దీనిని దృష్టిలో పెట్టుకునే నవీన్ ఉల్ హక్ కామెంట్స్ చేశాడు. ప్రపంచకప్‌లో కూడా అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ను ఆస్ట్రేలియా బహిష్కరిస్తుందా అని నవీన్ ఉల్ హక్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నను సంధిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. తమతో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడటానికి ఆస్ట్రేలియా నిరాకరించిందని, ఇప్పుడు ప్రపంచకప్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా వైఖరి ఏంటో చూడాలని ఆసక్తిగా ఉందని నవీన్ కామెంట్స్ చేశాడు. అప్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు నిరసనగా క్రికెట్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకుంది. దీనికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియాను నవీన్ టార్గెట్ చేశాడు.
అఫ్గాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడకూడదన్న క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తర్వాత, నవీన్-ఉల్-హక్ కూడా ఆస్ట్రేలియా T20 టోర్నమెంట్ 'బిగ్ బాష్ లీగ్'లో ఆడటానికి నిరాకరించాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుండగా నవీన్ మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తాడు. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు సెమీఫైనల్ అవకాశం ఇంకా ఉంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచకప్ సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే.. సెమీఫైనల్ రేసులో న్యూజిలాండ్, పాకిస్థాన్‌లను కూడా అధిగమించవచ్చు. కానీ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందన్న మాజీలు అంచనా వేస్తున్నారు. కంగారులు ఈ ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. అయితే, ఈ ప్రపంచకప్ ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి పెద్ద జట్లను అఫ్గాన్ జట్టు ఓడించింది.
ఇక లక్నోలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. ప్రపంచకప్‍లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవటంతో పాటుగా చరిత్రలో తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అఫ్ఘానిస్తాన్ అర్హత సాధించింది. బౌలర్లు, ఫీల్డర్ల అద్భుత ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో తొలుత నెదర్లాండ్స్‌ను 179 పరుగులకే అఫ్ఘానిస్థాన్ ఆలౌట్ చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘాన్ టీమ్.. 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్ఘాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్ త్వరగానే అవుటైనప్పటికీ.. కెప్టెన్ హజ్మతుల్లా షాహిది సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రహ్మత్ షా, షాహిది హాఫ్ సెంచరీలో సత్తా చాటడంతో అఫ్ఘాన్ మరో 19 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. మూడు వికెట్లు తీసిన మహ్మద్ నబీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.