Tanush Kotian: అశ్విన్ ప్లేసులోకి ముంబై యువ స్పిన్ ఆల్ రౌండర్.. బ్యాట్, బంతితోనూ సత్తా చాటగల ప్లేయర్..
Tanush Kotian: భారత్ తరపున రెండో అత్యంత విజయవంతమైన టెస్టు బౌలర్ గా అశ్విన్ రికార్డులకెక్కాడు. 537 వికెట్లతో తను సత్తా చాటాడు. తాజాగా అతని స్థానంలో యువ స్పిన్ ఆల్ రౌండర్ ని జట్టులోకి ఎంపిక చేశారు.
India Vs Aus Test Series: భారత టెస్టు ఆల్ రౌండర్, దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గతవారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే అతని స్థానంలో కొత్తగా ఆటగాడిని ఆస్ట్రేలియాకు పంపనుంది. 26 ఏళ్ల తనుష్ కొటియన్ ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి తను ప్రస్తుతం విజయ్ హజారే వన్డే టోర్నీలో ఆడుతున్నాడు. తాజాగా హైదరాబాద్ తో జరిగినమ్యాచ్ లో అతను ఆడాడు. తాజాగా టీమిండియాలోకి ఎంపిక కావడంతో మంగళవారమే తను ఆసీస్ కు పయనమవుతాడని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
Tanush Kotian has been added to India's squad for BGT. pic.twitter.com/dTQjRKkguw
— Kashif (@cricstate) December 23, 2024
ప్రత్యామ్నాయంగా..
ప్రస్తుత పరిస్థితుల్లో తనుష్ కు భారత తుదిజట్టులో చోటు దక్కే అవకాశం లేదు. మూడో టెస్టులో బ్యాటింగ్ లో 77 పరుగులతో అదరగొట్టిన రవీంద్ర జాడేజా మెల్ బోర్న్ లో జరిగే నాలుగో టెస్టుకు ఆడటం ఖాయం. అలాగే వాషింగ్టన్ సుందర్ రూపంలో మరో స్పిన్ ఆల్ రౌండర్ కూడా అందుబాటులో ఉన్నాడు. వీరిద్దరని కాదనుకుని ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని కొటియాన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం లేదు. నెట్ బౌలర్ గా ఉపయోగ పడటంతోపాటు జడ్డూ, వాషిలకు రిజర్వ్ ఆటగానిగా కొటియాన్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
చక్కని అనుభవం..
మరోవైపు కొటియాన్ కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది. ఇండియా-ఏ తరపున తను ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లాడాడు. ఎనిమిదో నెంబర్లో బ్యాటింగ్ కు దిగి కొన్ని విలువైన పరుగులు కూడా చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్త తన సొంతమని బోర్డు భావిస్తోంది. మొత్తానికి స్పిన్ ఆల్ రౌండర్లాగా ఉపకరించగలడని, 36 ఏళ్ల జడ్డుకూ ప్రత్యామ్నాయంగా పని చేస్తాడని బోర్డు ఆలోచనగా ఉంది. ఇక కొటియాన్ కు దేశవాళీల్లో మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు ముంబై తరపున 33 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లాడిన కొటియాన్ 101 వికెట్లు తీయడంతోపాటు, రెండు సెంచరీలతో 1500కు పైగా పరుగులు చేశాడు. అలాగే 20 లిస్ట్-ఏ మ్యాచ్ లు, 33 టీ20లు ఆడిన అనుభవం ఉంది. ఇక ఆసీస్-భారత్ జట్ట మధ్య నాలుగో టెస్టు ఈనెల 26న మెల్ బోర్న్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలుపు ఇరుజట్లకు కీలకం. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే ఈ టెస్టులో విజయం తప్పనిసరి అని భావిస్తున్నాయి. అందుకే నాలుగో టెస్టు కోసం ఇరు జట్లు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయి.